తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana High Court : 'జీవో 111పై ఎందుకింత ఉదాసీనత'

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నదీ పరివాహక పరిరక్షణ నిమిత్తం తీసుకువచ్చిన జీవో 111 వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీల పేరుతో ఏళ్లుగా కాలయాపన చేస్తుండటాన్ని తప్పుబట్టింది. 2016లో ఏర్పాటైన కమిటీ ఇప్పటివరకు ఎందుకు నివేదిక సమర్పించలేదని పేర్కొంది. ఇలాగే చేస్తే కమిటీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది.

Telangana High Court
తెలంగాణ హైకోర్టు

By

Published : Aug 12, 2021, 7:03 AM IST

హైదరాబాద్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నదీ పరివాహక పరిరక్షణ నిమిత్తం 1996 లో తీసుకువచ్చిన జీవో 111 పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈపీటీఆర్చ్ (ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ) 2006 లో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొన్ని సర్వే నెంబర్లు జీవో 111 పరిధిలోకి రావని పేర్కొందని, దాన్ని ఇప్పుడు తిరస్కరిస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కమిటీలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఎంత కాలం కొనసాగిస్తారని నిలదీసింది. 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని నిర్దేశిస్తూ నాలుగున్నరేళ్లయినా ఇంకా నివేదిక సమర్పించకపోవడాన్ని తప్పుబట్టింది. ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మాణం చేపడుతుంటే ఎన్జీటీలో పిటిషన్ దాఖలైందని, ఇందులో భాగంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని ప్రశ్నించింది.

ప్రభుత్వం సృష్టించిన సమస్యలే..

ప్రభుత్వం సృష్టించిన సమస్యలే ఇవని.. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కమిటీపై ఉందని హైకోర్టు పేర్కొంది. కమిటీ సమావేశాలు, తీర్మానాలు, దానిపై నిర్ణయాలపై స్పష్టత కోసం విచారణను ఈ నెల 16 కు వాయిదా వేసింది. వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నెంబర్లలోని భూములను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ, జీవోను కఠినంగా అమలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

వాయిదాకు నిరాకరణ..

ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్ . ప్రసాద్ హాజరై విచారణను వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. విచారణకు హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ. సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. కొన్ని భూములకు మినహాయింపు ఇవ్వాలన్న దానితో వివాదాలు మొదలవుతున్నాని అన్నారు.

ప్రభుత్వ తీరుపై అసంతృప్తి

కమిటీని 2016 లో ఏర్పాటు చేశారని... ఎన్నిసార్లు సభ్యులను మార్చారని ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ ఏం చేస్తుందో చెప్పడం లేదని, అది నిపుణుల కమిటీ కాదు కేవలం ఐఏఎస్ అధికారులే ఉన్నారని వ్యాఖ్యానించింది. ఈ దశలో న్యాయవాది జోక్యం చేసుకుంటూ నిపుణులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, 28 సార్లు సమావేశమైందని చెప్పారు.

ఈ నేపథ్యంలో తీర్మానాలు సమర్పించాలని, తుది నిర్ణయాలేంటో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. తీర్మానాలు సమర్పించడానికి గడువు కావాలని కోరగా.. ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 45 రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉండగా, ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారని, ఈ కమిటీ వల్ల ప్రయోజనం లేదని... రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ వివరణ నిమిత్తం గడువు కావాలని కోరడంతో ధర్మాసనం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details