సాగునీటి వసతి, 24 గంటల ఉచిత విద్యుత్ సహా వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. యాసంగిలో రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐ భారీగా ధాన్యాన్ని సేకరించింది. వరి సహా అన్ని పంటల విస్తీర్ణం... పంటల దిగుబడి పెరుగుతోంది. పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడి అనుగుణంగా రైతుల పంటలకు మెరుగైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సెజ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పండే పంటలను దృష్టిలో ఉంచుకొని సెజ్‌లకు అవసరమైన భూములు కేటాయించనున్నారు.
సెజ్‌ల ఏర్పాటు
ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల కోసం అవసరమైన భూమిని జిల్లాల్లో ఇప్పటికే గుర్తించారు. టీఎస్ఐఐసీ బృందాలు ఆ భూములను ఇప్పటికే ఓ దఫా పరిశీలించాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల ఏర్పాటు ద్వారా రైతులు పండించే పంటలకు మెరుగైన ధర వచ్చేలా చూడడంతో పాటు ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడం ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారి కోసం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానానికి మంచి స్పందన ఉంది. టీఎస్ ఐపాస్‌కు అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. అదే తరహాలో 2030 నాటికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.