ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ మరోసారి వాయిదా పడ్డాయి. బుధవారం నుంచి జరగాల్సిన ఎంట్రన్స్‌లను ప్రభుత్వం వాయిదా వేసింది. జులైలో జరగనున్న టైప్ రైటింగ్ పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. డిగ్రీ, పీజీ పరీక్షలపై జూలై 9లోగా స్పష్టత ఇవ్వాలని ఓయూ, జేఎన్టీయూహెచ్, ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది.
ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పాలిసెట్, పీజీ సెట్ పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహణకు కూడా సిద్ధమయ్యారు.
లాక్డౌన్ మళ్లీ విధిస్తారా..?
రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన ఉందా.. ఒకవేళ విధిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. లాక్డౌన్ కొనసాగించాలా వద్దా.. అనే విషయం కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఏజీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం కానుందని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. మధ్యాహ్నం వరకు గడువిస్తే ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకొని చెబుతామని ఈ ఉదయం హైకోర్టుకు ఏజీ తెలిపారు.