కొత్త రెవెన్యూ చట్టంలో... ఆ అధికారాలకు కత్తెర... కొత్త రెవెన్యూ చట్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలు అందేలా చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా గతంలోనే అధికారులు కొంతమేర కసరత్తు చేశారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్న నేపథ్యంలో సర్కార్ మరోమారు కొత్త రెవెన్యూ చట్టంపై దృష్టి సారించింది.
విచక్షణాధికారాలే అసలు సమస్య
బడ్జెట్ సమావేశాల్లోనే నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఉభయసభల ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులతో సీఎం సుధీర్ఘంగా సమీక్షించారు. భూ లావాదేవీలు, క్రయవిక్రయాల సందర్భంగా రెవెన్యూ అధికారులకు విచక్షణాధికారాలు ఉండడంతో పాటు జవాబుదారీతనం లేకపోవడమే ప్రధాన సమస్యగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి.
వివాదాలు ఉన్న భూమిలోనే
దాదాపుగా 85 నుంచి 90 శాతం వరకు భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండబోవు. వివాదాలు ఉన్న భూముల లావాదేవీలకు సంబంధించిన విషయంలోనే సమస్య ఉత్పన్నమవుతోంది. అక్కడే కిందిస్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి వరకు రెవెన్యూ అధికారులు ఇబ్బందులు తమకున్న విచక్షణాధికారాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న భావన ఉంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి సమస్యలు లేని భూముల విషయంలోనూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
ఆ నిబంధనల్లో మార్పులు
ఇదే సందర్భంలో నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయడంతో పాటు ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతోందని అంటున్నారు. వీటికి తోడు రెవెన్యూ అధికారుల ఇతర బాధ్యతలైన ధ్రువపత్రాలు, అనుమతులు తదితరాలకు సంబంధించి కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయన్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. దీంతో ఆ పరిస్థితులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా అవసరమైన నిబంధనలను కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపర్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.
అధికారాలకు కత్తెర
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులకు విచక్షణాధికారం లేకుండా చేయడం లేదా తక్కువ ఉండేలా చేసేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించే కోర్ బ్యాంకింగ్ విధానాన్నే భూముల లావాదేవీలకు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ దిశగా గతంలోనే చట్టసవరణ చేసినా పూర్తి స్థాయిలో అమల్లో లేదు. రుణాల మంజూరు, మార్ట్ గేజ్ తదితరాల కోసం రైతుల పాస్ బుక్‌లపై ఆధారంగా ఎలక్ట్రానిక్ భూరికార్డులను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చట్టసవరణ చేసింది. అయినా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో కొత్త చట్టంలో సంబంధిత అంశాలను విధిగా పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
11న జరగనున్న కలెక్టర్ల సదస్సులో జిల్లా పాలనాధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును సిద్ధం చేసి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇదీ చూడండి:ఎంజీబీఎస్ - జేబీఎస్ మెట్రోరైలును ప్రారంభించనున్న సీఎం