తెలంగాణ

telangana

ETV Bharat / city

మరోసారి భావసారూప్యత పార్టీలవైపు కేసీఆర్​ చూపు ​ - telangana government on electricity draft bill

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం సహా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత బిల్లు వల్ల రాష్ట్రాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... బిల్లును వ్యతిరేకించి తీరుతామని స్పష్టం చేశారు. భావసారూప్యత కలిగిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలతో సంప్రదింపులు చేసే దిశగా కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ముసాయిదా బిల్లును తిప్పి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

telangana government likely to sent Draft Bill on power  back
మరోసారి భావసారూప్యత పార్టీలవైపు కేసీఆర్​ చూపు ​

By

Published : May 9, 2020, 1:59 PM IST

విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే రాష్ట్రాలకు పంపింది. ఈనెల ఐదో తేదీలోగా సదరు బిల్లుపై అన్ని రాష్ట్రాలు అభిప్రాయం చెప్పాలని కేంద్రం కోరింది. లాక్​డౌన్ నేపథ్యంలో వచ్చే నెల ఐదు వరకు గడువు పొడిగించింది.

ఇప్పటికే వైఖరి స్పష్టం

ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ బిల్లుపై చర్చించారు. ముసాయిదా బిల్లు వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని.. విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కోల్పోతామని ప్రభుత్వం అంటోంది.

ప్రజలపైనే భారం

ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ సరఫరా, ఛార్జీలు, విద్యుత్ సంబంధిత పథకాలన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియమాలకు లోబడే అమలుచేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆరే వ్యాఖ్యానించారు. రాష్ట్రాల పాత్ర పూర్తిగా నామ మాత్రమవుతుందని తెలిపారు. విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్​ నియామకం కూడా కేంద్రమే చేపడుతుందని రాష్ట్ర సర్కారు అంటోంది. అదే జరిగితే విద్యుత్ ఛార్జీలు పెరగడం, రాయితీల భారం ప్రజలపైనే పడుతుందని కేసీఆర్​ తెలిపారు.

త్వరలోనే వెనక్కి

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది రైతులకు దీని వల్ల ప్రయోజనం చేకూరుతోంది. కేంద్ర ప్రతిపాదిత బిల్లు వల్ల పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారని.. తద్వారా రైతులకు నష్టం కలుగుతుందని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రంలోని 69 లక్షల మంది గృహవిద్యుత్ వినియోగదారులపై కూడా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ తిప్పి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా త్వరలోనే బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రానికి నివేదించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ విషయంలో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. భావసారూప్యత కలిగిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలతోనూ సంప్రదింపులు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇవీచూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details