తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​ 3.0: మాస్కు లేకుండా బయటకొస్తే జరిమానా - telangana lockdown news today

కరోనా కట్టడి కోసం లాక్​డౌన్​ను ఈనెల 29 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జోన్లతో సంబంధం లేకుండా కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలు, వలస కూలీలను తరలించే ప్రత్యేక రైళ్లను మినహాయించింది. ప్యాసింజర్​ రైళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంది. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే వేయి రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది.

lockdown
లాక్​డౌన్​ 3.0: మాస్కు లేకుండా బయటకొస్తే జరిమానా

By

Published : May 8, 2020, 5:10 PM IST

ఈనెల 29 వరకు లాక్​డౌన్​ను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. సంబంధిత మార్గదర్శకాలను విడుదల చేసింది. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే వేయి రూపాయల జరిమానా విదించనున్నట్లు వెల్లడించింది. రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది.

యథాస్థితి..

ఇతర రాష్ట్రాలు, జిల్లాల మద్య బస్సు సర్వీసుల రద్దు కొనసాగనుందని తెలిపింది. మెట్రో రైళ్లు, పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, హోటళ్లు, లాడ్జ్​లు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్​లు, స్విమ్మింగ్ పూల్స్, క్రీడా కాంప్లెక్సులు, పార్కులు, మ్యూజియంల మూసివేత కొనసాగనుందని స్పష్టం చేసింది.

బహిరంగ సభలు, మతపరమైన సమావేశాలకు అనుమతులు లేవని తెలిపింది. నిత్యవసర వస్తువులతో పాటు తిను బండారాలు.. వాటి రవాణాకు అనుమతినిచ్చింది. వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల రవాణాకు పచ్చజెండా ఊపింది.

గ్రీన్​ సిగ్నల్​..

ఆస్పత్రులు, క్లినిక్​లు, మందుల షాపులు, డయగ్నస్టిక్ సెంటర్లు, బ్యాంకేతర కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు పూర్తి అనుమతినిచ్చిన ప్రభుత్వం.. జీహెచ్​ఎంసీ పరిధిలోని రెడ్ జోన్లలో పరిమిత సిబ్బందితో పనులు చేసేందుకు అవకాశం కల్పించింది.

గ్రామీణ ప్రాంతాల్లోని స్టోన్ క్రషర్, ఇటుకల తయారీ, హ్యాండ్ లూమ్, మరమ్మతు దుకాణాలు, బీడి కార్మికులు, ఇసుక క్వారీలు, టైల్స్, మిల్లులు, ఫ్యాక్టరీలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు, పైపుల తయారీ వంటి దుకాణాలు తెరుచుకునేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్​, ఆరెంజ్​ జోన్ల పరిధిలో మాల్స్​ మినహా అన్ని దుకాణాలకు అనుమతి ఇచ్చింది. జీహెచ్ఎంసీ, రెడ్​జోన్లలో వేర్వేరు రోజుల్లో సరి-బేసి విధానంలో దుకాణాలు తెరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

33 శాతం సిబ్బంది మాత్రమే..

జీహెచ్ఎంసీ, రెడ్​జోన్ల పరిధిలో నిర్మాణ, వ్యవసాయ రంగ దుకాణాలకు అనుమతులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ -కామర్స్ విధానంలో అన్ని రకాల వస్తువుల సరఫరాకు పచ్చజెండా ఊపింది. రెడ్ జోన్, జీహెచ్ఎంసీ పరిధిలో.. నిత్యావసరాలకు మాత్రమే అనుమతించింది. జీహెచ్ఎంసీ, రెడ్​జోన్​లో ప్రైవేట్ కార్యాలయాలు, ఐటీ సంబంధిత కార్యాలయాలు.. 33 శాతం సిబ్బందితో పనిచేసేందుకు అనుమతించిన ప్రభుత్వం.. గ్రీన్​ ఆరెంజ్​ జోన్లలో ప్రైవేట్​ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవకాశం కల్పించింది.

ఇవీచూడండి:యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details