ఆకుపచ్చ తెలంగాణ వడివడిగా అడుగులేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం.. నేటి నుంచి ఏడో విడత హరితహారం (Haritha haram) కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం పెంచడమే లక్ష్యంగా.. 2015లో రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ సన్నిధిలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు దఫాల్లో 220 కోట్ల 70 లక్షల మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాల్లో 60 కోట్ల 81 లక్షలు, అడవుల వెలుపల 159 కోట్ల 88 లక్షల మొక్కలు నాటారు.
హరితహారం కోసం ఇప్పటి వరకు అన్ని శాఖలు కలిపి రూ.5,591 కోట్లు ఖర్చు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చర్యల ఫలితంగా 3.67 శాతం పచ్చదనం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2019 నివేదిక వెల్లడించింది.
ఏడో దశలో 20 కోట్ల మొక్కలు..
ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఏడో విడత హరితహారంలో.. మరో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,241 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి బహుళ వరుస రహదారి వనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని రకాల జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట పలు వరుసల్లో మొక్కలు నాటనున్నారు. వీలున్న ప్రతిచోటా యాదాద్రి నమూనాలో మియావాకీ తరహాలో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఏమిటి మియావాకీ విధానం..
మియావాకీ విధానం అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం. అంతేకాక త్వరితగతిన ఎదగడమే కాక.. దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ పచ్చదనానికి పెంచేందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు.