తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగవంతంపై ప్రభుత్వం దృష్టి

Telangana Double Bedroom Houses :రెండు పడకల గదుల ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు వివిధ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. అటు రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం కోసం ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది.

2bhk
2bhk

By

Published : Jan 26, 2022, 5:09 PM IST

Telangana Double Bedroom Houses : పేదవాడి ఆత్మగౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మిగతా లక్ష ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. పూర్తయిన ఇళ్లకు సంబంధించి కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో పాటు కేటాయింపులు చేయడంతో గృహప్రవేశాలు కూడా చేశారు. లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివాసం కూడా ఉంటున్నారు. అయితే మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తైనప్పటికీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో పాటు కేటాయింపులు చేయలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయినప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.

అధికారులతో సీఎస్​ సమీక్ష

వివిధ కారణాల రీత్యా కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోగా మరికొన్ని చోట్ల నెమ్మదించింది. రెండు పడకల గదుల ఇళ్ల అంశాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పరిస్థితి, సమస్యలు, దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించారు. ఇళ్లు పూర్తయిన చోట లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి కేటాయింపులు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వివిధ దశల్లో ఉన్న ఇళ్లు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు... విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ, రహదార్లు లాంటి మౌలిక వసతుల విషయమై కూడా చర్చించారు.

వారికి ఆర్థికసాయం అందించేందుకు

నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 1,100 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆ మొత్తంతో మిగతా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయవచ్చని చెప్తున్నారు. ఇదే సమయంలో కొత్త ఇళ్ల పనులు ప్రారంభంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం అనంతరం అమలు చేసే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. వీటికి ముడిపడి సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థికసాయం అందించే పథకం విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

నేడో, రేపో నోటిఫికేషన్

గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఖాళీగా, నిర్మాణం మధ్యలో ఆగిపోయిన రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రక్రియ త్వరలో జరగనుంది. ఇందుకోసం నేడో, రేపో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి :'పక్కా ప్రణాళికతోనే దాడి.. నా ప్రాణాలకు రక్షణ లేదు..'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details