రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో కనీవినీ ఎరుగని ప్రగతి సాధించి... దేశానికి దిక్సూచిగా నిలిచింది. 2014-15లో వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా... 2020-21లో కోటి 6 లక్షల ఎకరాల్లో వరిని పండించారు. 2014-15 ఏడాదిలో పౌరసరఫరాల సంస్థ రెండు సీజన్లకు కలిపి 24.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే... ఈ ఏడాది కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి చరిత్ర నెలకొల్పింది. ఒక్క యాసంగి గమనిస్తే 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే... ప్రస్తుతం 90 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే 587 శాతం కొనుగోళ్లు పెరిగాయి. 2019-20 వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు. తాజాగా ఆ రికార్డును అధిగమించి సరికొత్త మైలురాయిని చేరింది. వ్యవసాయ శాఖ, జిల్లా అధికారుల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో అదనంగా వచ్చిన ధాన్యాన్నీ కొనుగోలు చేసింది. కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో మరో 50 నుంచి లక్ష మెట్రిక్ టన్నుల వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం
ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అంచనాలకు మించి 2020-21 సంవత్సరంలో ఏకంగా కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం, అవినీతి అక్రమాలు బయటపడినా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏడేళ్లకాలంలో కొనుగోళ్లలో 576 శాతం పెరుగుదల కనిపించడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 6వేల 967 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరిపారు. 14.21 లక్షల మంది రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రధానంగా సూర్యాపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో గతేడాది యాసంగి కంటే ఈసారి 63 నుంచి 114 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. దాదాపు 25 జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 32 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో ఇప్పటివరకు 16వేల 878 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రైతుల ఖాతాల్లో 13వేల 753 కోట్లు జమ చేశారు. కేవలం గురువారం ఒక్కరోజే పౌరసరఫరాల సంస్థ 2 వేల కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం... హమాలీలు, డ్రైవర్లు, లారీల కొరత ఏర్పడటం... డిమాండ్‌కు తగ్గ మిల్లింగ్ సామర్థ్యం లేకపోవడం.... వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్, సహకార శాఖల మధ్య సమన్వయం లోపం వంటి సమస్యలను అధిగమించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పౌరసరఫరాల సంస్థ స్పష్టం చేసింది.
కోటి టన్నులకు పైగా ...
చరిత్రలో అత్యధికంగా కోటి టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేసిన పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఉన్నందుకు గర్వంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సేవచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.