పురపాలక ఎన్నికల ఫలితాలు తెరాస నిబద్ధతకు నిదర్శనమని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పారు.
జాతీయ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇకపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
తాను, మంత్రి కేటీఆర్ ప్రచారానికి కూడా వెళ్లలేదని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తెరాసకు పట్టం కట్టారని తెలిపారు. రూ.80 లక్షల విలువైన ప్రచార సామగ్రి మాత్రమే పార్టీ తరఫున ఇచ్చామని, అంతకుమంచి ఒక్క పైసా పంచలేదన్నారు.
ప్రతిపక్షాలు చౌకబారు మాటలతో ప్రజల తీర్పును అగౌరపరచవద్దని సూచించారు. విపక్షాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు గెలిచాయని, మరి వారెలా గెలిచారని ప్రశ్నించారు. విపక్షాలకు ప్రజలు ఇప్పటికే చాలా ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, అయినా తీరు మారలేదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం సాధించడం చాలా అరుదని కేసీఆర్ చెప్పారు. గతేడాది 32 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నికలు ఆపేందుకు విపక్షాలు చాలా ప్రయత్నం చేశాయని, కానీ ప్రజాశ్రేయస్సు కోసం ఎన్నికలకు వెళ్లామని చెప్పారు.