అవసరమైతే దిల్లీకి పోయి పోరాడతాం కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(telangana CM KCR) ఉద్ఘాటించారు. రైతులపై కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. దేశాన్ని పాలిస్తున్న నాయకులు రకరకాల వితండవాదాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం, మంత్రులు ధర్నాలు చేయడమేంటనీ భాజపా అంటుందన్న సీఎం కేసీఆర్.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ కూడా దీక్ష చేశారని గుర్తుచేశారు. దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని... అవసరమైతే దిల్లీకి యాత్ర(TRS dharna in Delhi) చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా చాలా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదని పేర్కొన్నారు.
"తెలంగాణ రైతుల ఉత్పత్తులు(paddy procurement in Telangana) కొనుగోలు చేయాలని, రైతు ప్రయోజనాలు రక్షించుకోవాలని ఈ పోరాటం మొదలుపెట్టాం. అన్నదాతల కోసం ఎక్కడిదాకైనా వెళ్తాం. తెలంగాణ పోరాటాల గడ్డ.. విప్లవాల గడ్డ.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలిసిన గడ్డ. పరాయి పాలకుల విష కౌగిలి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువు పీలుస్తూ అద్భుత పథంలో ముందుకు సాగుతోంది. ఈ సమయంలోనే అశనిపాతంలాగా రైతులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. అన్ని సమస్యల్లాగే ఈ సమస్యకూ పరిష్కారం కనుగొంటాం. దానికోసం ఎక్కడిదాకైనా వెళ్తాం.. ఎవరితోనైనా పోరాడతాం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా ధర్నా చేశారు. ఏకధాటిగా 51 గంటలు దీక్షకు కూర్చున్నారు. మరి ఇవాళ ప్రధాని మంత్రి హోదాలో ఉన్న అతను.. ఏ రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి రాకుండా చేయాల్సింది పోయి.. పోరాటానికి దిగిన వారిపై విమర్శలు చేస్తున్నారు."
- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తెరాస మహాధర్నా(TRS Maha Dharna at Indira Park)లో ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ పోరాటానికి ప్రతీకగా రైతుల పక్షాన తానే ఒక వరికంకిలాగా.. వరికంకులను ధరించి.. నాగలి భుజంపై వేసుకుని వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య(sathupalli MLA sandra)ను కేసీఆర్ అభినందించారు. తెరాస నేతలు, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.