CM KCR inspects secretariat: తెలంగాణ కొత్త సచివాలయాన్ని వచ్చే విజయ దశమికి ప్రారంభిస్తామని, ఈ లోపు పనులు పూర్తిచేసి అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీపడొద్దని, అన్ని విభాగాల పనులు సమాంతరంగా నిర్వహిస్తూ అత్యంత వేగంగా నిర్మాణాన్ని పూర్తిచేయాలని సూచించారు. కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం మంగళవారం పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు ప్రతి విభాగాన్నీ తనిఖీ చేశారు. అంతస్తుల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పిల్లర్లు, గోడలు, తలుపులు, కిటికీల డిజైన్లను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు. మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాల్లో గాలి, వెలుతురు వచ్చే ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తంచేశారు. లిప్టుల్లోనూ ప్రయాణించారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఎర్రరాయి(రెడ్‌స్టోన్) గోడ నిర్మాణాన్ని పరిశీలించి, దాని మన్నిక ఇతర వివరాలు తెలుసుకున్నారు. భవనాల మధ్య ఖాళీ ప్రదేశాల్లో గుంతలు వెంటనే పూడ్చాలని, లాన్, ఫౌంటేన్ల పనులను సమాంతరంగా పూర్తిచేయాలనే సూచనలిచ్చారు. అనంతరం సచివాలయ భద్రత గురించి చర్చించారు. నిర్మాణాలు పూర్తికావడానికి ముందే భద్రత సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎస్‌కు సూచించారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
CM KCR inspects secretariat: విజయదశమికి కొత్త సచివాలయం ప్రారంభం - సచివాలయం భవనాలను పరిశీలించిన సీఎం
CM KCR inspects secretariat: దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు, ఇంజినీర్లు వెళ్లారు. నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
70 శాతం పూర్తి...
దాదాపు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో నూతన సచివాలయం నిర్మిస్తున్నారు. సచివాలయ ప్రాంగణం మొత్తం 25 ఎకరాల్లో ఉండగా, వాస్తు ప్రకారం 20 ఎకరాల పరిధిలో చతురస్రాకార స్థలాన్ని ఎంపికచేసి నిర్మాణం చేపట్టారు. కాంక్రీటు, స్లాబులకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం భవనం ముందుభాగంలో ఎలివేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మొత్తంగా దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఐదు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, ఇతర సమావేశ మందిరాలు ఉంటాయి. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. సర్వర్లు, స్టోర్‌రూంలు, తదితరాలన్నింటినీ కింది అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటుచేస్తున్నారు. సందర్శకుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి ఉంటుంది. ప్రార్థనా మందిరాలు, మిగతా కార్యాలయాలన్నీ సచివాలయం వెలుపలే ఉంటాయి. ప్రహరీ లోపల కేవలం సచివాలయ భవనం మాత్రమే ఉంటుంది.
ఇదీ చదవండి :వ్యక్తిగతంగా అవహేళన చేయటం సరైన పద్ధతి కాదు: గవర్నర్ తమిళిసై