ముఖ్యమంత్రి కీసీఆర్ (CM KCR) అసెంబ్లీ సాక్షిగా గత రెండ్రోజులుగా పచ్చి అబద్ధాలు వల్లిస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay ) మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కూడా అవమానించేలా మాట్లాడుతూ సభా సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి, విమానాశ్రయాల అనుమతి సహా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టం చేస్తూ బండి సంజయ్ మంగళవారం రాత్రి గణాంకాలతోసహా వాస్తవాలను వెల్లడించారు.
వారిద్దరికి ఇచ్చింది గుర్తులేదా?
రాష్ట్రానికి పద్మశ్రీ అవార్డుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రధానమంత్రి, హోంమంత్రితో మాట్లాడినా ఫలితం లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ (Bandi Sanjay ) తప్పుపట్టారు. పైరవీలకు తావు లేకుండా పురస్కారాలకు అర్హుల్ని గుర్తించేందుకు కమిటీ వేశారని గుర్తుచేశారు. అందువల్లే రాష్ట్రం నుంచి వనజీవి రామయ్య, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం వంటి వారికి పురస్కారాలు లభించాయన్నారు.
యునెస్కో గుర్తింపు ఎలా వచ్చింది?
విదేశాంగమంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 19 సభ్యదేశాలను ఒప్పించి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం కేంద్రం ఘనత కాదా? అని ప్రశ్నించారు. జోగులాంబ ఆలయానికి కేంద్రం రూ.60 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక తప్పిదంతో ఆలస్యమైన మాట వాస్తవం కాదా? అని అడిగారు. ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.8 కోట్లు విడుదల చేయడం నిజం కాదా? అన్నారు.