Bandi Sanjay About Job Notifications : కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం విడ్డూరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జోనల్ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారు. కేసీఆర్ నాలుగేళ్లు ఆలస్యం చేసి కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 12 వేల మంది విద్యావాలంటీర్లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని అన్నారు. 15వేల మంది స్టాఫ్నర్సులను పునరుద్ధరించలేదని చెప్పారు.
Bandi Sanjay Reaction on Job Notifications : 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. ఆలస్యంగానైనా వచ్చిన ఉద్యోగాల ప్రకటనను భాజపా విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. భాజపా పెడుతున్న సెగతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ వీడి జిల్లాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడతామని స్ఫష్టం చేశారు.