తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేంద్ర వ్యవసాయ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం'

రాష్ట్రాలకు సమాచారం లేకుండా వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

telangana agriculture minister niranjan reddy
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

By

Published : Sep 21, 2020, 5:21 PM IST

Updated : Sep 21, 2020, 6:03 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఊసెందుకు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు ఉత్పత్తులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే భవిష్యత్​లో కార్పొరేట్ల గుత్తాధిపత్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ రైతు, ప్రభుత్వాల చేయి దాటి కార్పొరేట్​ శక్తుల చేతిలోకి వెళ్తుందన్నారు.

కార్పొరేట్లు, రైతులకు మధ్య వివాదాలు తలెత్తితే ఎవరి పరిష్కరిస్తారని అడిగారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఉన్న మధ్య వర్తిత్వ అవకాశాన్ని ఈ బిల్లు కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లుతో పాటు విద్యుత్​ బిల్లు లోపభూయిష్టంగా ఉందని మండిపడ్డారు. కేంద్ర వ్యవసాయ, విద్యుత్ బిల్లులు రైతు మెడపై కత్తిలాగా మారనున్నాయని నిరంజన్ రెడ్డి వాపోయారు.

లాభాపేక్ష తప్ప ఏ మాత్రం మానవత్వం ఉండని విదేశీ, స్వదేశీ బహుళ జాతి కంపెనీలు, వ్యాపారులు.. గ్రామీణ పేద రైతాంగం మీదకు ఎగబడేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని మంత్రి నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ఏ విధంగా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. నిత్యావసర చట్టం పరిధి నుంచి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నూనెగింజలు, పప్పుధాన్యాలను తొలగించడం ద్వారా కార్పొరేట్లు, దళారులకు రెడ్ కార్పెట్ పరిచినట్లేనని... ధరలు తక్కువ ఉన్పప్పుడు బ్లాక్ చేసి, వినియోగం పెరిగినప్పుడు ధరలు పెంచి అమ్ముతారని ఆరోపించారు.

రాష్ట్రాలు కట్టిన పన్నుల వాటాలే కేంద్రం వెనక్కు ఇవ్వడం లేదని.. కరంట్ బిల్లు కడితే తిరిగి ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సర్కార్.. 26 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నందున కేంద్రం బిల్లు దీనికి విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. మీటర్లు బిగించడం, నిర్వహణ డిస్కంలకు పెద్ద భారంలా మారుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Last Updated : Sep 21, 2020, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details