కరోనా కేసులు వెలుగుచూసిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక విధి విధానాలు రూపొందించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీలోని కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి.. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
24 గంటల పర్యవేక్షణ..
కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాన్నంతా కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి మొత్తాన్ని ఎనిమిది అడుగుల ఎత్తుతో బారికేడింగ్ ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ప్రవేశ మార్గాన్ని ఏర్పాటుచేసి 24 గంటలపాటు పోలీసుల పర్యవేక్షణ ఉండాలి. బయట వారు లోపలికి వెళ్లకూడదు. లోపలి వారు అనుమతి లేకుండా బయటకు రాకూడదు. ఇళ్ల ముందు కూడా ఎలాంటి సంచారం ఉండరాదు.
అధికారుల బృందాలు
కేసుల సంఖ్య ఆధారంగా కంటైన్మైంట్ జోన్ పరిధిని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఒక్కో కేసుకు కనీసం వంద ఇళ్లను పరిశీలనలోకి తీసుకోవాలి. పురపాలక, పోలీసు, వైద్యారోగ్య అధికారులతో కలిపి కంటైన్మెంట్ జోన్ ప్రాంతానికి ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలి. సర్కిల్, జోనల్ స్థాయిల్లోనూ అధికారుల బృందాలను నియమించాలి. కంటైన్మెంట్ జోన్‌లోని రాకపోకలను పూర్తిగా రికార్డు చేయాలి. ముందు జాగ్రత్తగా ప్రాంతంలోని ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలి. జోన్‌కు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. జోన్లో విధులు నిర్వర్తించే వారందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూర్చాలి.