Lokesh attend Visakha court : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రికపై గతంలో విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా ఇవాళ విశాఖకు వచ్చారు. కోర్టు వాయిదా అనంతరం కోర్టు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
6/2020 నెంబరుతో దాఖలైన వ్యాజ్యంలో తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుకూల పత్రిక నాపైన, మానాన్నపైన తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల సహాయంతోనే వివేకానంద రెడ్డిని హత్యచేశారని ఆరోపించారు.
చినబాబు చిరుతిళ్లు...
చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో సాక్షి, డెక్కన్ క్రానికల్‌లో వార్త రాశారని.. సాక్షిపై రూ.75 కోట్లు, డెక్కన్ క్రానికల్ రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేశానని ఆయన తెలిపారు. ఈనెల 28న, వారికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. తనను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తలు రాస్తున్నారని, తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికీ జరగకుండా ఉండేలా న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.