ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దని, అన్ని గ్రామాల్లోనూ ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘ఏపీ ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు చాలా నిక్కచ్చిగా ఉన్నాయి. ఎన్నికల్లో వైకాపా విధ్వంసకాండపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. వెనుకంజ వేయాల్సిన పరిస్థితి లేదు. వైకాపా విధ్వంసకాండపై వీరోచితంగా పోరాటం చేయాలి. రాజ్యాంగానికి తూట్లు పొడిచి హింసా దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయాలని చూస్తే వైకాపాకు బుద్ధి చెప్పాలి’ అని పేర్కొన్నారు.
తొలిరోజే ఎక్కువ నామినేషన్లు వేయాలి..
'నామినేషన్ల స్వీకరణ తొలిరోజే సాధ్యమైనంత ఎక్కువగా నామినేషన్లు వేయాలి. ఏవైనా సాంకేతిక అభ్యంతరాలున్నా తర్వాత వాటిని పరిష్కరించుకోవచ్చు. అభ్యర్థులంతా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నోడ్యూస్ సర్టిఫికెట్ పొందేలా వీలు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతి పంపాం. ఎక్కడ ఆటంకాలు ఎదురైనా, వైకాపా నాయకులు ఘర్షణలకు దిగినా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలు సేకరించాలి. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలి. లిఖితపూర్వకంగా ఫిర్యాదుతోపాటు వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందించాలి. పార్టీకీ సైతం పంపాలి’ అని సూచించారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
'ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు 24 గంటలూ పనిచేసేలా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. లీగల్ సెల్ న్యాయవాదులంతా ఎన్నికలపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులంతా వారి సలహాలు, సూచనలను తీసుకోవాలి’ అని సూచించారు.