TDLP on Three capitals: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం, టిడ్కో ఇళ్ల పంపిణీ, గృహ నిర్మాణం, దళితులు, మైనార్టీలపై దాడులు, క్షీణించిన శాంతిభద్రతలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మూడు రాజధానులపై జగన్‌కు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని.. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి సవాల్ విసరబోతున్నామని తెదేపా శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
బాక్సైట్ అక్రమ మైనింగ్, మద్యం కుంభకోణం, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రజలపై భారాలు, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యంపై.. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అస్తవ్యస్త రహదారులు, లేపాక్షి భూములు, విభజన హామీల అమలు, పంచాయితీల నిధుల మళ్లింపు, శాండ్ మైనింగ్, అమరావతి రాజధాని అంశాలపైనా చర్చకు పట్టుబట్టాలని నేతలు నిర్ణయించారు.
మరోవైపు అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ చేస్తున్న.. తాజా అరెస్టులపైనా చర్చించారు. రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో సీఐడీ కేసులు ఉద్దేశపూర్వకమని మండిపడ్డారు. లావాదేవీలే జరగని అంశాల్లో.. అక్రమ కేసులేంటని శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు సెక్షన్లు పెట్టిన సీఐడీ అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.