తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth Phone call to Chandrababu) పరామర్శించారు. శుక్రవారం (నవంబర్ 19) ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్.. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
అన్నాడీఎంకే సీనియర్ నేత ఫోన్..
అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ మేరకు మైత్రేయన్ ట్వీట్ చేశారు. 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో తనకు పరిచయాలున్నట్లు మైత్రేయన్ చెప్పారు. ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు కన్నీటిపర్యంతం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి(Chandrababu crying news) గురయ్యారు. వైకాపా సభ్యులు.. ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్రంగా అవమానించారంటూ... మాటలు తడబడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు.... కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన సతీమణిని అనరాని మాటలు అన్నారంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. ఇలాంటి అవమానం తట్టుకోలేనంటూ వెక్కివెక్కి ఏడ్చారు. ఉబికి వస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకునే ప్రయత్నం చేసినా.... అవమానభారంతో ఆయనకు ఉద్వేగం ఆగలేదు. అధినేత కన్నీళ్లు పెట్టడం చూసిన తెలుగుదేశం నేతలు నిశ్చేష్టులయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా మొక్కవోని ధైర్యంతో దీటుగా ఎదుర్కొనే చంద్రబాబు.... ఒక్కసారిగా ఏడవడంతో వాళ్లూ కంటతడి పెట్టారు.