చాలా రోజులుగా వస్తోన్న వార్తలను నిజం చేస్తూ... మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ కమలం గూటికి చేరుకున్నారు. దిల్లీలో కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్న స్వామిగౌడ్... పదవుల కోసం భాజపాలో చేరట్లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడడం కోసమే భాజపాలో చేరుతున్నానని తెలిపారు.
'ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తెరాసను వీడుతున్నా' - తెరాసను వీడిన స్వామిగౌడ్
18:21 November 25
కారు దిగి కమలం గూటికి చేరిన స్వామిగౌడ్...
భాజపాలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. భాజపాను తన మాతృ సంస్థగా భావిస్తానని పేర్కొన్నారు. ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మాభిమానం కోసం పోరాడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన చాలా మందిని తెరాస దూరం పెట్టిందని స్వామిగౌడ్ ఆరోపించారు. తెలంగాణ బిడ్డలు కనీస మర్యాదకు కూడా నోచుకోలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్లలో కనీసం వందసార్లు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించానన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తెరాసను వీడుతున్నానన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపానే మేయర్ పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి రంగంలో దిగనున్న కేంద్ర మంత్రులు...