తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్‌కు పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబ్‌ - హైదరాబాద్‌లో పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబ్

KTR London Tour Updates : హైదరాబాద్ ఫార్మారంగంలో మరో కలికితురాయి చేరింది. మహానగరంలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. లండన్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన సర్ఫేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ సంస్థ.. దేశంలో ఎక్కడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

KTR London Tour Updates
KTR London Tour Updates

By

Published : May 18, 2022, 8:01 PM IST

KTR London Tour Updates : రాష్ట్ర ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టనుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన సర్ఫేస్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ సంస్థ ప్రకటించింది. యూకేలో పర్యటిస్తున్న పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆ సంస్థ ఎండీ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, ప్రతినిధుల బృందం ఈ మేరకు లేబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

Particle Characterization Laboratory in Hyderabad : ఏడువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ల్యాబ్‌లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాస్యూటికల్ పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు చేపడతారు. పలు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ లేబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండేళ్లలో ల్యాబ్‌ను మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సర్ఫేస్‌ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాలే హైదరాబాద్‌లో తమ అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు కారణమని సర్ఫేస్‌ సంస్థ ఎండీ విలియమ్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలతో ఈ ల్యాబ్ కలిసి పనిచేస్తుందని... దీంతో తెలంగాణ ఫార్మారంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందని అన్నారు. హైదరాబాద్ లాంటి పారిశ్రామిక అనుకూలతలున్న నగరంలో తమ సంస్థ ల్యాబ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.

హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రవేశిస్తున్న సర్ఫేస్ మేనేజ్‌మెంట్ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ఏర్పాటు చేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమని అన్నారు. ఫార్మాకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికీ లేని అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయన్న కేటీఆర్... సర్ఫేస్ మేనేజ్‌మెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details