ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో ఉత్పత్తులు, ముడి సరకు విక్రయాల సొమ్మును విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎల్జీ పాలీమర్స్‌లో గతేడాది మే 1న విష వాయువు విడుదలై పలువురు మృతిచెందిన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగా ఎల్జీ పాలీమర్స్ ఉత్పత్తులు, ముడి సరకు విక్రయంతో వచ్చిన ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలీమర్స్... సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ యూ.యూ లలిత్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ కేఎం జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఇప్పటికే 37 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 50 కోట్లు కలెక్టర్ వద్ద డిపాజిట్ చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.