రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి విద్యార్థులకు టీవీ పాఠాలు(Digital Classes) ప్రారంభమయ్యాయి. టీవీలు లేక.. ఉన్నా కనెక్షన్ లేక .. అసలేం చెప్తున్నారో అర్థం గాక విద్యార్థులంతా అయోమయానికి గురయ్యారు. వారి వద్ద పాఠ్యపుస్తకాలు కూడా లేకపోవడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని అధ్యాయాలున్నాయి? టీవీల్లో చెప్పే పాఠ్యాంశం ఏమిటి వంటి విషయాలు వారికి తెలియదు. పాఠశాల విద్యార్థులకు కూడా టీవీ పాఠ్యాంశాలు(Digital Classes) మొదలైనా వారికి పాత తరగతులకు సంబంధించి బ్రిడ్జి కోర్సు నడుపుతున్నారు. దానివల్ల గత ఏడాది పంపిణీ చేసినవి వారి వద్ద ఉండే అవకాశం ఉంది. ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు మాత్రం నేరుగా పాఠాలు మొదలు కావడం గమనార్హం.
లక్ష మంది విద్యార్థులకు సమస్య
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు లక్ష మంది రెండో సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులున్నారు. సర్కారు కళాశాలల్లో చదివే వారికి ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలు అందజేస్తుంది. ఈసారి ఇప్పటివరకు అవి కళాశాలలకే చేరలేదు. ఎంత మందికి పుస్తకాలు కావాలో ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలుగు అకాడమీకి వివరాలు పంపిస్తారు. ఆ సంస్థ అధికారులు వాటిని ముద్రించి కళాశాలలకు పంపిస్తారు. ప్రస్తుతం పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి. ఇంకా వారం రోజులు పట్టనుంది. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు పూర్తయితేనే ఆయా కళాశాలలకు పంపిస్తారు.
మొత్తానికి వేగంగా పని జరిగినా అవి ఆయా కళాశాలలకు చేరడానికి మరో 15 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలలకు పిలిపించి పంపిణీ చేయాలి. గత ఏడాది ప్రత్యక్ష తరగతులు లేనందున కొంత వరకు పునశ్చరణకు ఉపయోగపడతాయని ప్రధాన సబ్జెక్టుల ముఖ్యాంశాలన్నీ ఒకే పుస్తకంలో ఉండేలా గ్రూపుల వారీగా ఇంటర్ విద్యాశాఖ స్టడీ మెటీరియల్‌ను రూపొందించింది. పరీక్షలకు ముందు వాటిని పంపింది. అదే సమయంలో పరీక్షలు రద్దు కావడంతో అవి కళాశాలల్లోనే ఉన్నాయి. వాటిని ఈసారి రెండో ఏడాది విద్యార్థులకు ఇవ్వాలన్న ఆలోచనలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు ఉన్నారు.