అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఐదు రోజుల్లో తొమ్మిది వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి... నేటి ఉదయం హనుమద్వాహనంపై దర్శనమివ్వనున్నారు. శ్రీ రామచంద్రమూర్తి అలంకార ప్రాయుడై... కోదండం చేతపట్టిన శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
నమ్మిన బంటే వాహనంగా
శ్రీ రాముని నమ్మిన బంటైన ఆంజనేయుని వాహనంపై శ్రీనివాసుడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. భక్తికి ప్రతీకైన హనుమంతుణ్ని... ధర్మానికి మారుపేరైన కోదండ రాముని దివ్యమంగళ స్వరూపాన్ని వెంకటేశ్వరునిలో దర్శించుకునే అవకాశం కలిసి రావడం నిజంగా ప్రత్యేకతేనని ఆగమ పండితులు అభివర్ణిస్తున్నారు.