తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలో నిండుకుండలా శ్రీశైలం!

భారీవర్షాలతో రాష్ట్రంలో నదులకు ప్రవాహం కొనసాగుతోంది. ఈ నెలలోనే దాదాపుగా అన్ని రిజర్వాయర్లు నిండే అవకాశం ఉంది. ఎగువ నుంచి నుంచి ప్రవాహం కొనసాగుతుండటం వల్ల... వారం పదిరోజుల్లో శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

srisailam dam storage become full in few days
త్వరలో నిండుకుండలా శ్రీశైలం!

By

Published : Aug 16, 2020, 7:06 AM IST

భారీవర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రిజర్వాయర్లన్నీ ఆగస్టులోనే నిండే అవకాశాలున్నాయి. ఆలమట్టి నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం, తుంగభద్ర గేట్లు ఎత్తేయడంతో వారం పదిరోజుల్లో శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కృష్ణా పరీవాహకంలో...

కృష్ణాలో ఎగువన కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్‌లు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. ఆలమట్టిలోకి లక్షా 22వేల క్యూసెక్కులు వస్తుండగా, నారాయణపూర్‌ నుంచి 70వేల క్యూసెక్కులు జూరాలకు వదులుతున్నారు. ఆలమట్టికి ప్రవాహం పెరిగితే దిగువనా పెరుగుతుంది. భీమా ప్రవాహంతో కలిపి జూరాలలోకి శనివారం సాయంత్రం లక్షా 45వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, లక్షా 25వేల క్యూసెక్కులు బయటకు వదిలారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను శనివారం ఎత్తేశారు. తుంగభద్ర, అటు ఆలమట్టి నుంచి వచ్చే నీటితో శ్రీశైలానికి ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టులోకి లక్షా 25వేల క్యూసెక్కులు రాగా, 40వేల క్యూసెక్కుల నీటిని తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు విడుదల చేస్తోంది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నిండటానికి 65 టీఎంసీలు, కింద ఉన్న పులిచింతలకు 35 టీఎంసీలు అవసరం.

గోదావరి పరీవాహకంలో...

కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సరస్వతి బ్యారేజీ గేట్లను ఎత్తడంతో గోదావరి పరుగులు పెడుతోంది. కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద శనివారం నదిలో 10.10 మీటర్ల మట్టంతో 4.20లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. మరోవైపు మానేరు, స్థానికంగా వస్తున్న వరదతో అన్నారం, సరస్వతి బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం ఎగువన శ్రీరామసాగర్‌కు 16,757 క్యూసెక్కులు వస్తున్నాయి.ఎల్లంపల్లికి 30,537 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ప్రాజెక్టు నిండటానికి ఇంకా 6.11 టీఎంసీలు అవసరం.

ABOUT THE AUTHOR

...view details