తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...నేటి నుంచి వాహన సేవలు

తితిదే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టింది. సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలు జరగనున్నాయి.

Tirumala Brahmotsavams
Tirumala Brahmotsavams

By

Published : Oct 7, 2021, 7:30 AM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తితిదే శ్రీకారం చుట్టింది. సాయంత్రం సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. సాయంత్రం 6 నుంచి రంగనాయకుల మండపంలో సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు. ఆలయంలో యాగమందిరాలను నిర్మించారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఇక్కడ యజ్ఞం కొనసాగుతుంది. వేడుకలను ఈసారి కూడా ఏకాంతంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలను ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలు జరగనున్నాయి. సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. కార్యక్రమంలో జీయ్యంగార్లు, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి, బోర్డు సభ్యులు మల్లీశ్వరి, విద్యాసాగర్‌రావు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

11న ఏపీ సీఎం పట్టు వస్త్రాల సమర్పణ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 11వ తేదీన శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అన్నమయ్య భవనంలో ఆయన మాట్లాడుతూ.. స్వర్ణరథోత్సవం, రథోత్సవానికి బదులు సర్వభూపాల వాహనసేవ జరుగుతుందన్నారు. చక్ర స్నానాన్ని ప్రత్యేక నీటి తొట్టిలో నిర్వహిస్తామని చెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నఏపీ సీఎం జగన్‌

తిరుపతిలో బర్డ్‌ ఆసుపత్రిలో నిర్మించిన చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ప్రారంభించనున్నారు. అలిపిరి పాదాల వద్ద నిర్మించిన గోమందిరం, గోప్రదక్షిణం, తులాభారం, గోప్రాశస్త్ర్యాన్ని తెలిపే కార్యక్రమాలు, అలిపిరి కాలినడక మెట్ల దారిని సీఎం ప్రారంభిస్తారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన బూందీపోటు, శ్రీ వేంకటేశ్వర కన్నడ, హిందీ భక్తి ఛానల్‌ను 12న ప్రారంభిస్తారు. కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై పాల్గొంటారు.

ఇదీ చదవండి:TTD Brahmotsavam 2021: శ్రీవారి ఆలయానికి చేరిన దర్బచాప, తాడు.. విశిష్టతలివిగో..

ABOUT THE AUTHOR

...view details