రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉన్నందున పేదలకు ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చౌకధరల డీలర్ల ద్వారా వారాంతంలోగా లబ్ధిదారులకు పంపిణీ చేపట్టేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. భారత ఆహార సంస్థ గోదాముల నుంచి పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం నిల్వల తరలింపు ప్రక్రియను సోమవారం ప్రారంభించారు.
రవాణా వాహనాల సంఖ్య పెంచాలని నిర్ణయం
తొలిదశలో ఎఫ్‌సీఐ గోదాముల నుంచి రాష్ట్రంలోని 170 పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం చేరుతాయి. రెండో దశలో అక్కడి నుంచి జిల్లాల వారీగా డీలర్లకు బియ్యాన్ని పంపిణీ చేస్తారు. మొత్తం 3.36 లక్షల మెట్రిక్ టన్నులు తరలించాల్సి ఉంటుందని అంచనా. రెండు నెలలకు సరిపడా బియ్యం సరఫరా నేపథ్యంలో.. అవసరం మేరకు రవాణా వాహనాల సంఖ్యను పెంచాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. రవాణాశాఖ ద్వారా వాహనాల గుర్తింపును వేగవంతం చేయాలని ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు.