తెలంగాణ

telangana

ETV Bharat / city

పడి లేచే కెరటం.. తెదేపా 40ఏళ్ల ప్రస్థానంలో.. ఎన్నో ఒడిదొడుకులు - tdp 40 years celebrations

పడి లేచే కెరటం... తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరితూగే పదమిది. 40 ఏళ్ల ప్రస్థానంలో.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. పార్టీ పని అయిపోయిందన్న మాటలు.. ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు.. ఫినిష్ అంటూ బెదిరింపులు..ఇలా అనేక సంక్షోభాలను తట్టుకుంటూ ప్రజా మద్దతును కూడగట్టుకుంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ...సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ...పోరాట పంథానే కొనసాగిస్తోంది.

tdp 40 years celebrations
tdp 40 years celebrations

By

Published : Mar 29, 2022, 6:46 AM IST

పడి లేచే కెరటం.. తెదేపా 40ఏళ్ల ప్రస్థానంలో.. ఎన్నో ఒడిదొడుకులు

4 దశాబ్ధాల రాజకీయాల్లో అప్రతిహత విజయాలను తెలుగుదేశం సాధించింది. ఉత్థానపతనాలు చవిచూసింది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు. జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక మనుగడ కోసం పోరాటం సాగిస్తుంటే...ప్రాంతీయ పార్టీగా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్రతో పాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన తొలి ప్రాంతీయ పార్టీగానూ ఘనత దక్కించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో 16 సంవత్సరాలు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు కలిపి.... మొత్తం 21సంవత్సరాలు తెదేపా అధికారంలో కొనసాగింది. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది, చంద్రబాబు దార్శనికత, నిబద్ధతగల కార్యకర్తల వల్లే పార్టీ నలభైఏళ్ల సుదీర్ఘ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగిందని సీనియర్‌ నేతలు చెబుతున్నారు.


సంక్షోభాలు కొత్తకాదు: తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్తకాదు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూలదోయడం, ఆ తర్వాత జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం.... కాంగ్రెసేతర పార్టీలకు తెలుగుదేశానికి దగ్గర చేసింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సానుభూతి పవనాల ధాటికి దేశంలోని ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోతే, తెదేపా ఎదురొడ్డి నిలిచి ఘన విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలసి ఏకంగా 35 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. లోక్‌సభలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి..నాలుగున్నరేళ్లపాటు ప్రధాన ప్రతిపక్షం పాత్ర నిర్వహించింది. దాన్ని ఎన్టీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భాజపా, జనతాపార్టీ, వామపక్షాల్ని కలిపి.......జాతీయస్థాయిలో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలంగా వ్యవహరించారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏపార్టీకీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితుల్లో చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకి చొరవ చూపారు. దానికి కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఫ్రంట్‌ అధికారంలో ఉన్న రెండేళ్లలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చింది. తెదేపా నేత బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ఎంపిక వంటి సందర్భల్లో చంద్రబాబు మాట చెల్లుబాటయ్యింది.

పరీక్షా సమయం:40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక ఉత్థాన పతనాలు చవి చూసిన తెలుగుదేశం పార్టీ... ఇప్పుడు కీలకమైన పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల నుంచి మరో బలమైన ప్రాంతీయ పార్టీతో తెలుగుదేశం పోటీ పడాల్సి వస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ అనుభవం, రాజకీయ చతురత పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. పార్టీని మరో 30-40 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా తీర్చిదిద్దడం, యువనాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యమని చంద్రబాబు ఇటీవల పదేపదే చెబుతున్నారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా ఆదిశగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదీచూడండి:I-Telugudesam : కంభంపాటి రామ్మోహన్‌రావు ‘నేను-తెలుగుదేశం' పుస్తకావిష్కరణ

ABOUT THE AUTHOR

...view details