తెలంగాణ

telangana

ETV Bharat / city

Gobbillu Pooja: సంధ్య గొబ్బెమ్మల పేరంటం.. ముందస్తు సంక్రాంతి సందడి

Sankranthi gobbillu Pooja: సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. దాని వెనుక ఎన్నో సంప్రదాయాలు దాగి ఉన్నాయి. మన జీవనశైలి, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఇమిడి ఉంటాయి. అందులో భాగమే సంధ్య గొబ్బెమ్మల పేరంటం.. యుక్తవయసుకు వచ్చిన అమ్మాయిలతో నెల రోజుల పాటు చేయించే ఈ కార్యక్రమం వెనుక మన ఆచార వ్యవహారాలు ఎన్నో దాగి ఉన్నాయి. మరి ఆ సందిగొబ్బెమ్మల పేరంటం సందడి ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

Gobbillu Pooja
సంధ్య గొబ్బెమ్మల పేరంటం

By

Published : Jan 13, 2022, 12:02 PM IST

సంధ్య గొబ్బెమ్మల పేరంటం

Gobbillu Pooja: పండుగలంటే పూజలు, పిండివంటలే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను తర్వాత తరాలకు అందించడం కూడా. ఇందులో సంక్రాంతి ముందు వరుసలో ఉంటుంది. పల్లెప్రజల జీవనశైలితో పాటు రైతుల ఆనందహేళికి అద్దం పట్టే.. 3 రోజుల పండుగలో భిన్నమైన కార్యక్రమాలు చేస్తుంటారు. పెళ్లీడుకు వచ్చిన యువతకు సంప్రదాయాలు, ఆచారాలు నేర్పించడంతోపాటు మంచి భర్త రావాలని చేసే పూజే సంధ్య గొబ్బెమ్మల పేరంటం. సంక్రాంతికి నెల రోజుల ముందు ప్రారంభమయ్యే ధనుర్మాసం నుంచే ఈ తంతు మొదలవుతుంది. రోజూ ఉదయం ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేసి యువతులతో గొబ్బెమ్మలు పెట్టిస్తారు. ఇక భోగికి ముందు రోజు చేసే కార్యక్రమం కీలకమైనది. ఇది సాయంత్రం వేళ చేయడం వల్ల సంధ్య గొబ్బెమ్మల పేరటం అని పిలుస్తారు.

మంచి భర్త రావాలని

యుక్తవయసులో ఉన్న అమ్మాయిలు.. రంగవల్లులు దిద్ది.. వాటిపై గొబ్బెమ్మలను పెట్టి.. పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆ తర్వాత గణపతిపూజ, గౌరీపూజతో పాటు విష్ణుమూర్తికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పేరంటానికి వచ్చిన వాళ్లు ప్రత్యేకమైన పాటలు పాడతారు. అమ్మాయికి మంచి భర్త రావాలని, మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్లాలని దీవిస్తారు.

ఆటపాటలతో

యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి పేరంటంలో పాల్గొంటారు. బంధువులతో పాటు ఇరుగు పొరుగు వారిని కూడా పేరంటానికి ఆహ్వానిస్తారు. అంతా కలిసి సరదాగా, సంతోషంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కేవలం పాటలే కాకుండా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చేసే నృత్యాలు ఆకట్టుకుంటాయి. పేరంటానికి వచ్చిన వారికి పసుపు, కుంకుమ, ప్రసాదాలు అందించి క్రతువు ముగిస్తారు. సంక్రాంతికి ముందే నిర్వహించే ఈ సంధ్య గొబ్బెమ్మల పేరంటం తెలుగు లోగిళ్లలో ముందస్తు సందడిని తెచ్చిపెట్టింది.

ఇదీ చదవండి:Telangana Gurukul Teachers : 'మాకు గవర్నమెంట్ టీచర్ల కన్నా ఎక్కువ వేతనం ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details