Rohanki Gopalakrishna: అతను సివిల్స్ మూడో ర్యాంకు సాధించాడు..! ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించేందుకు తిరిగి తన ప్రాంతానికే వచ్చిన ఆ యువకుడు.. మారుమూల అటవీ ప్రాంతం వారికీ హైదరాబాద్, దిల్లీ తరహాలో కోచింగ్ సౌకర్యాలు కల్పించాలని సంకల్పించాడు. సివిల్స్‌కు సిద్ధమయ్యే వారికి తనవంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నాడు. అమల్లో పెట్టేశాడు! ఆయనే.. ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గకు చెందిన రోణంకి గోపాలకృష్ణ.
Rohanki Gopalakrishna: సివిల్స్ పరీక్షల్లో దేశంలోనే మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ.. తెలుగు మీడియంలోనే పరీక్షలకు సిద్ధమయ్యారు. మొదట్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ఆయన.. ఆ తర్వాత మరింత కృషి, పట్టుదలతో సివిల్స్ టాపర్‌గా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఐటీడీఏ పాడేరు ప్రాజెక్టు అధికారిగా ఉన్న గోపాలకృష్ణ.. స్థానిక గిరిజన యువకుల్లోని ప్రతిభకు సానపెట్టి వారిని ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.
Rohanki Gopalakrishna: ముందుగా గోపాలకృష్ణ సివిల్స్ కోచింగ్ కోసం ఫ్యాకల్టీలను సంప్రదించారు. హైదరాబాద్, దిల్లీ వంటి కోచింగ్ సెంటర్లలో బోధించే వారినే ఈ కోచింగ్‌కు రప్పించాలని నిర్ణయించారు. ముందుగా 50 మందితో శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించిన గోపాలకృష్ణ.. స్థానిక గిరిజన యువతకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సివిల్స్ శిక్షణ కోసం మొత్తం 1500 మంది దరఖాస్తు చేశారు. వీరికి విద్యాశాఖ సిబ్బంది సాయంతో రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి 128 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల్లో నెగ్గిన వారికి ఏడాది పాటు ఉచితంగా సివిల్స్ శిక్షణ అందిస్తారు.