భారీ వర్షాలు, వాతావరణ మార్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల పెరుగుదల, వర్షాల తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం వల్ల హైదరాబాద్‌లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంటు వ్యాధులు ప్రభలకుండా తక్షణమే నగర వ్యాప్తంగా పేరుకుపోయిన చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను తొలిగించాలని అధికారులను ఆదేశించారు. నీరు నిల్వ కారణంగా దోమల వృద్ధి చెందకుండా ఉండేందుకు యాంటి లార్వా, వెక్టర్ కంట్రోల్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ నెల 4 నుంచి గ్రేటర్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ నెల 4 నుంచి గ్రేటర్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్
ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు వార్డు స్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నగర ప్రజలు తమ ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ 040-2111, 040 1111లకు ఫిర్యాదు చేయవచ్చని సీఎస్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 199 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా ఇంకో 37 కొత్త బస్తీ దవాఖానాలను వారంలోపు తెరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.