75 ఏళ్ల స్వతంత్య్ర(75th Independence day) స్ఫూర్తిని.. దేశ స్వాతంత్య్ర పోరాట పటిమను.. ఈ 75 ఏళ్లలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేలా కేంద్ర సర్కార్ ఈయేడు స్వాతంత్య్ర వేడుకలను జరపనుంది. ఇందులో ప్రజలను కీలక భాగస్వాములుగా చేయాలని నిర్ణయించింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని.. నభూతో న భవిష్యత్ అనే రీతిలో నిర్వహించేందుకు శ్రీకారం చుడుతోంది. స్వతంత్య్ర పోరాట వీరుల త్యాగాలను భావితరాలకు వివరించాలని భావిస్తోంది.
75th Independence day : దేశభక్తిని చాటుకోండిలా... యువతకు కేంద్రం అద్భుతావకాశం! - special initiative on the occasion of 75th Independence day
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు(75th Independence day) పూర్తి చేసుకున్నందున ఈ ఏడు స్వాతంత్య్ర వేడుకలను అంగరంగవైభవంగా జరిపేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ అపురూప ఘట్టాన్ని అద్భుతంగా జరిపి.. చరిత్రలో మరపురాని రోజుగా మలిచేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది. భారత యువత.. తమకు దేశంపై ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఓ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. అదేంటంటే..?
యంగ్ ఇండియాగా పేరుగాంచిన భారత్‌లో... యువత తమ దేశభక్తిని చాటుకునేలా.. దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని(75th Independence day) పురస్కరించుకుని.. rashtragaan.in వెబ్‌సైట్‌తో ఒక ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరైనా వీడియోలు రూపొందించి, జాతీయ గీతాన్ని అప్‌లోడ్ చేయొచ్చు. ఎంపిక చేసిన వీడియోలన్నింటినీ క్రోడీకరించి ఒకే వీడియోగా మలిచి ఆగస్టు 15న అందుబాటులో ఉంచుతారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోని విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని కోరింది. కరోనా కారణంగా వేడుకలన్నీ ఎక్కువగా ఆన్‌లైన్‌కే పరిమితం చేయడంతో, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పాల్గొన్న కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం ధ్రువీకరణ పత్రం అందజేస్తుంది. 12 భారతీయ భాషల్లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్ చేయొచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ rashtragaan.in తెరవాలి.
- విద్యార్థి వివరాలు నమోదు చేయాలి.
- రికార్డింగ్ లింక్‌లోకి వెళ్లి వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్ చేయాలి.
- అక్కడి నుంచే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ జెండా పండుగ(75th Independence day) నాడు.. నూతన సంకల్పాలకు ప్రతిన బూనుదామని ఇటీవలే ఓ మీడియా సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. సనాతన భారతంతో పాటు నవీన భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటుదామని చెప్పారు. మన యోగుల ఆధ్యాత్మిక ప్రతిభను, శాస్త్రవేత్తల బలాన్ని ప్రతిబిబించేలా స్వాంతంత్య్ర వేడుకలను ఒక పండుగలా నిర్వహించుకుందామన్నారు.