తెలంగాణ

telangana

Software employee selling vegetables: చదువే సాయంగా.. జీవితాన్ని గెలిచారు

Software employee selling vegetables: ఆమె ఓ ఐటీ సంస్థ ఉద్యోగి. కూరగాయలు అమ్ముతోంది. ఎందుకు అని అనుకుంటున్నారా? దీనికి వెనుక పెద్ద స్ఫూర్తివంతమైన కథే ఉంది. ఆ కథను ఈటీవీ భారత్​ మీకు అందిస్తోంది చదివేయండి.

By

Published : Dec 10, 2021, 2:12 PM IST

Published : Dec 10, 2021, 2:12 PM IST

Software employee selling vegetables: చదువే సాయంగా.. జీవితాన్ని గెలిచారు
Software employee selling vegetables: చదువే సాయంగా.. జీవితాన్ని గెలిచారు

Software employee selling vegetables:కూరగాయలు అమ్ముతున్న అమ్మాయిని చూశారా? ఆమె ఓ ఐటీ సంస్థ ఉద్యోగి కూడా! మరి కూరగాయలమ్ముతోందేం అనుకుంటున్నారా? తనదీ, తన తోబుట్టువుల ప్రయాణం ముడిపడింది దాంతోనే మరి. పేదకుటుంబం. దీనికితోడు నాన్న చనిపోయాడు. ఇల్లే గడవని స్థితి.. తమ బతుకులో మార్పు తెచ్చేది చదువే అని నమ్మారు. తల్లికి చేదోడువాదోడుగా ఉంటూనే చదువును కొనసాగించారు. తర్వాత అమ్మ కూడా దూరమైంది. అయినా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ లక్ష్యంవైపు అడుగులు వేస్తున్నారు!

అమ్మమ్మతో ఝాన్సీ, రేవతి

ఝాన్సీరాణి, రేవతి, సాయిశారద.. అక్కాచెల్లెళ్లు. వీళ్లది ఏపీ విజయవాడలోని కానూరు. వీళ్ల నాన్న సురేంద్ర కుమార్‌ కుటుంబం ఒడిశా నుంచి వలస వచ్చి విజయవాడలో స్థిరపడింది. వెల్డింగ్‌ పనులే జీవనాధారం. ఆదాయమూ బాగుండేది. స్థానికంగా నివసించే శివదేవిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఎంత కష్టపడైనా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు. కానీ అనారోగ్యంతో సురేంద్ర కుమార్‌ చనిపోయారు. అప్పటిదాకా దాచిందీ ఆయన చికిత్సకే ఖర్చైంది. దీంతో కుటుంబ భారం శివదేవిపైనే పడింది.

బడికెళ్లే స్థోమత లేక..

ముగ్గురూ అమ్మాయిలే, మగతోడు లేదు.. ఏం చేయాలో తోచలేదామెకు. తల్లి సంరక్షణలో వాళ్లనుంచి, ఆమె పనులకు వెళ్లేది. ఉండటానికి సరైన ఇల్లూ లేదు. మూడు పూటలా వాళ్ల కడుపు నింపితే చాలనుకుంది. పిల్లలూ బడికెళ్లే స్థోమతలేక ఇంటి వద్దే ఉండిపోయారు. దగ్గర్లోని ఓ దంపతులు వాళ్లని చూసి చదువుకోమనీ, దాని ద్వారా వాళ్ల కష్టాలెలా గట్టెక్కుతాయో వివరించారు. ఆ మాటలు అక్కాచెల్లెళ్లలో విద్యపై ఆసక్తిని రేపాయి. స్కూలుకి వెళతామని అమ్మ దగ్గర పట్టుబట్టారు. ఆమె కూడా కాదనలేకపోయింది. ఇంతలో ఆమెకీ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం దొరికింది. ఇంటి దగ్గర కూరగాయల కొట్టూ ప్రారంభించింది. స్కూలు సమయం మినహా ఆ పనుల్నీ ఈ అమ్మాయిలే చూసుకునేవారు. పిల్లలు పెరిగేకొద్దీ సంపాదన చాల్లేదు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో పెద్దమ్మాయి ఝాన్సీకి పెళ్లి చేసింది. ఆమె భర్త చిరుద్యోగి. అతనికి తోడుగా తనూ చిన్న ఉద్యోగంలో చేరింది. కానీ చదువును మాత్రం ఆపలేదు. ఇంతలో శివదేవి అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు వాళ్లకి పెద్ద దిక్కు వయోవృద్ధురాలు నాగేశ్వరమ్మే. అమ్మమ్మకు తోడుగా తన కుటుంబంతోపాటు ఝాన్సీ చెల్లెళ్ల బాగోగులను చూస్తూనే డిగ్రీ కూడా చదువుతోంది.

ఉద్యోగం చేస్తూనే..

ఇన్నేళ్ల వీళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. రెండో అమ్మాయి రేవతి బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగాన్ని సాధించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఇంటివద్ద నుంచే పనిచేస్తోంది. తన ఆదాయమూ కుటుంబానికి తోడైంది. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అమ్మమ్మకు తోడుగా కూరగాయలూ అమ్ముతోంది. వీళ్లిద్దరూ కలిసి చిన్న చెల్లెలు సాయిశారదను చదివిస్తున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. కష్ట సమయంలో ఎటూ దిక్కుతోచక ఉన్న మాకు ఆ దంపతులు చూపిన మార్గం చదువువైపు దృష్టి నిలిపేలా చేసిందనీ.. అదే ఈరోజు తమ జీవితాలను నిలబెట్టిందనీ ఈ అక్కాచెల్లెళ్లు ఉద్వేగంగా చెబుతున్నారు. ఇన్ని కష్టాలను ఎదురొడ్డుతూ జీవితాన్ని గెల్చేందుకు ఈ అమ్మాయిలు చేస్తున్న పోరాటాన్ని చూసి అమ్మమ్మ నాగేశ్వరమ్మ గర్వపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు చదువు అవకాశాలను దెబ్బతీసినా.. మనోనిబ్బరంతో పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకున్నారీ యువతులు. అన్ని అవకాశాలూ, సదుపాయాలూ ఉండి, చదువును నిర్లక్ష్యం చేస్తోన్న ఎంతోమందికి వీరి ఆరాటం, జీవన పోరాటం స్ఫూర్తినిస్తాయి కదూ!

ఇదీ చదవండి:

Money saving ideas: నెలనెలా పొదుపు పెరగాలా? ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details