Singareni Privatization : దేశంలోని గనుల వేలానికి సంబంధించి కేంద్రం ఇటీవల ‘ఖనిజాలు, గనుల అభివృద్ధి’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలోని గనులను వేలంవేసి అధిక ధర నమోదు చేసిన వారికి కేటాయించడమే ఈ విధానం. వేలం జాబితాలో తొలిసారి తెలంగాణలోని నాలుగు కొత్త బొగ్గు గనులను నమోదుచేసింది. నూతన విధానం కింద వీటిని వేలం వేస్తున్నామని, వాటి అవసరం ఉందనుకుంటే ప్రైవేటు కంపెనీలతోపాటు వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ప్రతి గనిపై వచ్చే ఆదాయంలో ఎంత సొమ్మును ప్రభుత్వ వాటా కింద ఆదాయ భాగస్వామ్యం(రెవెన్యూ షేర్) ఇస్తారో తెలుపుతూ వేలం టెండర్లలో ధరను కోట్ చేయాలనే నిబంధన విధించింది. వేలం విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి 3 రోజులపాటు సమ్మె చేశాయి.
చేసిన ఖర్చంతా వృథాయేనా
Singareni Mines Privatization : గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు తవ్వకాలకుగానూ సింగరేణి సంస్థకు 44 అనుమతులను (లైసెన్సులను) నిజాం ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. నూతన విధానంలో భాగంగా ఈ ప్రాంతాలకు బయట ఉన్న గనులను కేంద్రం వేలం జాబితాలో చేర్చింది. నిజానికి ఈ నాలుగు గనుల్లో బొగ్గు నిల్వలు ఏమేరకు ఉన్నాయి? ఉత్పత్తి సామర్థ్యం ఎంత? అనే అంచనాలు రూపొందించేందుకు చేసిన సర్వే, మౌలిక సదుపాయాలకుగానూ సంస్థ రూ.167 కోట్లను కొన్నేళ్లుగా ఖర్చుపెట్టింది. పైగా ఈ నాలుగు..ప్రస్తుతం సింగరేణికున్న పాత గనుల పక్కనే ఉండటం వల్ల వాటి నుంచి బొగ్గు తవ్వడం సులభం. ఈ పరిస్థితుల్లో అవి ప్రైవేటుపరమైతే ఇప్పటివరకూ చేసిన ఖర్చు వృథా కావడంతోపాటు, ఆయా సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చినట్లవుతుందని సంస్థ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.