Singareni generates Solar Power : నల్లబంగారం ఉత్పత్తిలో అపార అనుభవం గడించిన సింగరేణి సంస్థ.. ప్రత్యామ్నాయ రంగాల్లో సైతం రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటోంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించే దిశంగా అడుగులు పడుతున్న క్రమంలో పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలన్న కేంద్ర ఆదేశాలతో ఆ దిశగా ముందుకు సాగుతోంది. 2024 చివరి నాటికి 2వేల మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యంగా కృషి చేస్తోంది. ఇప్పటికే సింగరేణి పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మూడు దశల్లో పలు కాంట్రాక్టు సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పింది. మొదటి దశలో భాగంగా 129 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లను బీహెచ్‌ఈఎల్ చేపట్టింది. ఆర్‌జీ–3లో 50, ఇల్లందులో 39, మణుగూరులో 30, ఎస్టీటీపీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తై ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.
మొట్టమొదటిసారిగా ఆర్జీ-3 ఏరియాలో..
Singareni generates Solar Energy : రెండో దశలో భాగంగా కొత్తగూడెంలో 37, మందమర్రి ఏ బ్లాక్‌లో 28, బి బ్లాక్‌లో 15, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్లు కూడా ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు ఆర్జీ-3 ప్లాంటు కూడా ప్రారంభం కావడంతో సింగరేణి సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 219 మెగావాట్లకు చేరింది. ఇక, మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాట్లను అదానీ, నోవాస్‌గ్రీన్ సంస్థలకు సింగరేణి అప్పగించింది. సింగరేణిలో ఇప్పటి వరకు ఒకే చోట 50మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేవలం ఆర్జీ-3ఏరియాలో చేయడం ఆనందంగా ఉందని జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు.
వాటిపైనా సింగరేణి దృష్టి..
Singareni generates Solar Electricity : సింగరేణి సంస్థ వైవిద్యీకరణలో భాగంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి, ఖనిజ తవ్వకాలు, ఇసుక క్వారీల నిర్వహణ వైపు దృష్టిని సారించింది. ఇందులో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జలాశయంపై నీటితో తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను నోవాస్‌గ్రీన్ సంస్థకు అప్పగించారు. ఆర్‌జీ–3 ఓపెన్‌కాస్ట్ డంప్‌పై 22, డోర్లీ ఓపెన్‌కాస్ట్ డంప్‌పై 10 మెగావాట్లు, కొత్తగూడెం, చెన్నూరు ఏరియాల్లో నేలపై రెండు ప్లాంట్లలో 34 మెగావాట్ల ప్లాంట్లను నిర్మిస్తున్నారు. వాస్తవానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇప్పటివరకు సోలార్ విద్యుదుత్పత్తి చేయడం లేదు.
థర్మల్‌తో పాటు సోలార్ విద్యుదుత్పత్తి..
Singareni Solar Power Plants : థర్మల్‌తో పాటు సోలార్ విధానంలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది సింగరేణి సంస్థ మాత్రమే. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రిడ్‌కు అనుసంధానమైన సోలార్ ప్లాంట్ల ద్వారా సెప్టెంబర్ 21 నాటికి 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఈ విద్యుత్‌ను ట్రాన్స్‌కో లైన్లకు అనుసంధానం చేసి తనకు అవసరమైన మేర వినియోగించుకోవడంతో సంస్థకు రూ.75 కోట్ల మేర ఆదా చేయగలిగింది. మొత్తం సంస్థ నిర్దేశించుకున్న 300 మెగావాట్ల లక్ష్యం పూర్తైతే ప్రతియేటా రూ.120 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్‌ను సంస్థ వినియోగించుకుంటోంది.
ఇప్పుడు లోయర్.. తర్వాత మిడ్ మానేర్..
Solar Power Plants By Singareni : దిగువ మానేరులో ఏర్పాటు చేయబోయే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణికి నిధుల కొరత లేదు. పీపీఏ పూర్తైతే విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్దం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ విజయవంతమైతే మధ్య మానేరులోను విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటున్నారు.