Shamshabad Airport News: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 2008 మార్చి 23న జీఎంఆర్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో నాలుగోది. దిల్లీ, ముంబయి, బెంగళూరు తర్వాత అత్యంత రద్దీగల ఎయిర్‌పోర్టుగా నిలిచింది. తొలుత ఏడాదికి కోటి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే లక్ష్యంతో ఎయిర్‌పోర్టు నిర్మించారు. కానీ ఊహించని రీతిలో ఏటికేడు వృద్ధి నమోదు కావడంతో... 3కోట్ల 40 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా జీఎంఆర్ విస్తరణ చేపట్టింది. ప్రస్తుతం ప్రతి ఏటా రెండు కోట్లమందికిపైగా ప్రయాణాలు చేస్తున్నారు. మూడు దశల్లో విమానాశ్రయం విస్తరణ పూర్తైతే... ఏటా 15 నుంచి 20శాతం లెక్కన ప్రయాణాలు పెరిగినా మరో ఐదారు ఏళ్ల వరకు ఇబ్బంది ఉండదని జీఎంఆర్ భావిస్తోంది.
విమానాశ్రయ విస్తరణలో భాగంగా తొలిదశలో 1,05,000 చదరపు మీటర్ల వైశాల్యంతో టెర్మినల్-1 అభివృద్ధి చేశారు. ఏటా కోటి40లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా సదుపాయాలు కల్పించారు. లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో హాంగర్స్, ఎయిర్ కంట్రోల్ టవర్... టెక్నికల్ భవనం, నిర్వహణ హ్యాంగర్స్ తదితర వాటి కోసం 49,500 చదరపు మీటర్లు వైశాల్యం వినియోగించారు. 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం, ఓ హోటల్ నిర్మాణం చేశారు. ఇప్పటికే తూర్పు భాగాన 15,742 చదరపు మీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది.