గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కోసం ఓటరు స్లిప్పుల పంపిణీని రేపటిలోగా వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2009, 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివిధ రకాల ఓటరు అవగాహనా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పోలింగ్ 50 శాతం మించలేదని... ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిగా జరగకపోవడమే ఇందుకు ఓ ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీన జరగనున్న పోలింగ్ కోసం ఈ నెల 25వ తేదీ లోగా ఓటరు స్లిప్పులను క్షేత్రస్థాయి సిబ్బంది పంపిణీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పంపిణీని జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
స్లిప్పుల పంపిణీని ధృవీకరించుకోవాలి...
డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కనీసం 30శాతం ఇళ్లను, జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని కనీసం పదిశాతం ఇళ్లను సందర్శించి ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందా లేదా అన్న విషయాన్ని ధృవీకరించుకోవాలని తెలిపింది. ప్రతి వార్డుకు ఒక ఉద్యోగిని కేటాయించి మహిళా సంఘాలు, ఇంటి యజమానులను ఫోన్లో సంప్రదించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి 27వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. అధికారులు, పరిశీలకులు ఓటరు స్లిప్పుల పంపిణీని పర్యవేక్షిస్తారని, ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.