తెలంగాణ

telangana

ETV Bharat / city

పిల్లలకు పాఠాలు మొదలవకముందే.. తల్లిదండ్రులకు ఫీజుల క్లాసులు

ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడటం వల్ల ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు తమ పని మొదలుపెట్టాయి. క్లాసులు ప్రారంభం కాకముందే ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకు చెబుతున్నాయి. ఫీజులు కట్టిన వాళ్లకే పాఠాలు చెబుతామని భయపెడుతున్నాయి.

schools started Charging fee
schools started Charging fee

By

Published : Jun 13, 2021, 1:41 PM IST

Updated : Jun 13, 2021, 1:54 PM IST

వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకుని.. ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభం కానున్న తరుణంలో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఫీజులుం ప్రదర్శిస్తున్నాయి. గతేడాది బకాయిలు చెల్లించడంతోపాటు ఈ ఏడాది మొదటి టర్మ్‌ ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజులు కట్టిన విద్యార్థులకే పాఠాలు వినేందుకు అవకాశం కల్పిస్తామని తెగేసి చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వేలకు వేలు ఫీజులు ఎలా కట్టాలని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

ఆ జీవో వర్తించేనా..?

నెలవారీగా ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.46 విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికీ ఆ జీవో వర్తిస్తుందా.. లేదా అన్నది విద్యాశాఖ నుంచి స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాలు లేవన్న సాకుతో కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు 10-15 శాతం పెంచి మరీ ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి.

ఇప్పటికే బోధన షురూ

ఈ నెల 15వరకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ పట్టించుకోకుండా సీబీఎస్‌ఈ విభాగంలోని పలు పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధన షురూ చేశాయి. ఈ విషయంపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని తెగేసి చెబుతున్నాయి. ఫీజులు కట్టని విద్యార్థులను పాఠశాలలోని గ్రూపుల్లోంచి తొలగిస్తుండటంతో పాఠాలు వినేందుకు వీలులేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ‘‘ ప్రభుత్వం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా అన్ని రకాల ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.’’ అని మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ కాలనీకి చెందిన విద్యార్థి తల్లి హిమబిందు వాపోయారు.

ప్రభుత్వం స్పందించాలి

"ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల వసూలుపై ప్రభుత్వం స్పందించాలి. గతేడాది ఇచ్చిన జీవో 46 ప్రకారమే వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పటికే పది రకాల ఫీజులు కలిపి కట్టించుకుంటున్నాయి. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా దోపిడీని నియంత్రించేలా విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలి." - నాగటి నారాయణ, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు

ఇదీ చూడండి:బాత్​రూమ్​లో కొండ చిలువ.. గుండెలు హడల్​!

Last Updated : Jun 13, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details