తెలంగాణ

telangana

ETV Bharat / city

జనవరి 3 వరకు శ్రీవారి దర్శనం కష్టమే...! - తితిదే తాజా వార్తలు

తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు తీసుకుని శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు నిరాశ తప్పదు. జనవరి 3 వరకు తిరుపతి మినహా మిగిలిన ప్రాంతాలవారు వస్తే ఇబ్బందులు పడాల్సిందే.

జనవరి 3 వరకు శ్రీవారి దర్శనం కష్టమే...!
జనవరి 3 వరకు శ్రీవారి దర్శనం కష్టమే...!

By

Published : Dec 21, 2020, 10:00 AM IST

సర్వదర్శనం టోకెన్లు తీసుకుని శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు నిరాశ తప్పదు. జనవరి 3 వరకు తిరుపతి మినహా మిగిలిన ప్రాంతాలవారు వస్తే ఇబ్బందులు పడాల్సిందే. ఆదివారం రాత్రికే 24వ తేదీ వరకు సర్వదర్శన టోకెన్లను అధికారులు ఇచ్చేశారు. దీనివల్ల సోమ, మంగళవారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుపతి నుంచి వెనుదిరిగి వెళ్లాల్సిందే. మరోవైపు 25 నుంచి పది రోజులపాటు తిరుపతిలోని స్థానికులకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తితిదే అధికారులు స్పష్టం చేశారు. దీంతో జనవరి 3 వరకు తిరుపతికి వచ్చే సామాన్య భక్తులకు సర్వదర్శనం లేనట్లే. తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు కౌంటర్ల ద్వారా రోజుకు 10 వేల మంది భక్తులకు ఒకరోజు ముందు సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని అధికారులు గతంలో ప్రకటించారు. అయితే ఆదివారం నాటికే గురువారంవరకు ఉన్న సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేశారు.

సమాచారం లేకుండానే..

వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని భావించారు. ఇదే సమయంలో తితిదే ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నిత్యం శ్రీవారి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ చూసే భక్తులు వెంటనే టికెట్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారికి దొరకని పరిస్థితి. సర్వదర్శనం టోకెన్లు తీసుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తే... తితిదే అధికారులు రెండు రోజుల క్రితమే సర్వదర్శన టోకెన్లను స్థానికులకే పరిమితం చేసినట్లు చెప్పారు.

సర్వదర్శన కౌంటర్ల దగ్గర భక్తుల ఆందోళన

దర్శనం, సదుపాయాల కల్పనలో తితిదే యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భక్తులు ఆరోపించారు. తిరుపతిలోని విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ ఎదుట ఆదివారం వివిధ రాష్ట్రాల వారు ఆందోళనకు దిగారు. తితిదే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో విష్ణునివాసం దగ్గర ఉన్న భక్తులు తిరుపతి రైల్వేస్టేషన్‌ ఎదుట బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను 24 గంటల ముందుగా అందిస్తామని తితిదే ప్రకటించిందని, సుదూర ప్రాంతాల నుంచి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వస్తే 4, 5 రోజుల తర్వాత దర్శనానికి టికెట్లను ఇస్తున్నారని పలువురు భక్తులు ఆరోపించారు. విశాఖపట్నానికి చెందిన భక్తుడు మాట్లాడుతూ... తాము 10 మంది కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతి చేరుకున్నామని, టికెట్లు మంగళవారం దర్శనానికి ఇచ్చారన్నారు. తితిదే వసతి సముదాయాల్లో ఒకరోజు కంటే ఎక్కువ ఉండనివ్వడం లేదని, బయట గది తీసుకుని 10 మంది ఉండాలంటే అప్పు చేయాల్సిందేనని వాపోయారు. దీనిపై ఓ విజిలెన్స్‌ అధికారి మాట్లాడుతూ... కౌంటర్ల దగ్గర రోజువారీ టికెట్లు ఇస్తున్నామని, భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల 600 టికెట్లను 21 నాటికి విడుదల చేశారన్నారు. ఇందులో కొంత ఇబ్బంది రావడంతో 21 నాటి టికెట్లను నిలిపివేసి 24 నుంచి జారీ చేశామన్నారు.

ఇదీ చదవండి:చిగురించిన ఆశలు... కోచింగ్‌ కేంద్రాలకు ఫోన్ల మీద ఫోన్లు

ABOUT THE AUTHOR

...view details