తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Village Secretariat : సచివాలయాల ఉద్యోగుల షాక్‌.. వినూత్న రీతిలో నిరసన - sachivalayas employees protest

AP village secretariat : ప్రొబేషన్‌ ఖరారు చేయకపోవడంపై ఏపీ గ్రామ సచివాలయాల ఉద్యోగులు.. సర్కారుపై వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి అత్యధిక మంది సిబ్బంది వైదొలగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల నుంచే ఖరారు చేసి, పే స్కేల్‌ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. విధులను బహిష్కరిస్తే కఠిన చర్యలు తప్పవని.. అనేక చోట్ల ఉన్నతాధికారులు ఇప్పటికే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు.

AP Village Secretariat
AP Village Secretariat

By

Published : Jan 9, 2022, 12:54 PM IST

AP village secretariat: వారంతా ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న చిరుద్యోగులు. అయినా వారిలో అత్యధికులు ఒక్కటయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీలోని అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మెజార్టీ ఉద్యోగులు ఒక్క మాట మీదకు వచ్చారు. ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్‌ ఇచ్చారు. వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఉన్నతాధికారుల్ని పరుగులు పెట్టించారు. ఉద్యోగంలో చేరి 2021 అక్టోబరు రెండో తేదీకే రెండేళ్లయినా తమకు ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి చేయకపోగా.. ఈ ఏడాది జూన్‌ 30లోగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించడంపై వారంతా తీవ్ర నిరసన తెలియజేశారు. రోజువారీ కార్యకలాపాలపై ఆదేశాలిచ్చేందుకు, మార్గనిర్దేశం చేసేందుకూ జిల్లా సంయుక్త కలెక్టర్‌ వంటి ఉన్నతాధికారులు అడ్మిన్‌లుగా నిర్వహిస్తున్న అధికారిక వాట్సప్‌ గ్రూపుల నుంచి నిష్క్రమించడాన్ని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు సాధనంగా ఎంచుకున్నారు. శనివారం ఉదయం నుంచే అటు కడప నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ.. అధికారిక గ్రూపుల నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరుగా అత్యధిక సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు బయటకు వచ్చేశారు.

ప్రొబేషన్‌ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందుకు నిరసనగానే గ్రూపుల నుంచి నిష్క్రమిస్తున్నామని కొందరు సందేశాలు పెట్టారు. కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈనెల నుంచే తమకు ప్రొబేషన్‌ ఇచ్చి, పెంచిన వేతన స్కేల్‌ని అమలుచేయాలన్న డిమాండ్‌తో వారు ఆందోళన బాటపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా అధికారిక గ్రూపుల నుంచి నిష్క్రమిస్తుండటంతో.. అసలు ఏం జరిగిందో ఉన్నతాధికారులకు కాసేపు అర్థం కాలేదు. విషయం తెలిశాక షాక్‌ తిన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో చాలా మంది సోమవారం నుంచి విధుల్ని కూడా బహిష్కరించి, సమ్మె చేసే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో మరింత కంగారు పడ్డారు.

మెగా ఓటీఎస్‌ మేళాపై ఆందోళన

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఓటీఎస్‌ పథకానికి సంబంధించి సోమవారం ఏపీవ్యాప్తంగా ‘మెగా మేళాలు’ నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సచివాలయ సిబ్బంది విధుల్ని బహిష్కరిస్తే.. కార్యక్రమం విఫలమవుతుందని ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. ఉద్యోగులతో నిరసన విరమింపజేయాలని, వారంతా వెంటనే గ్రూపులో మళ్లీ చేరేలా చూడాలని వార్డు, గ్రామ సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌.. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. ‘‘సోమవారం మెగా ఓటీఎస్‌ మేళా నిర్వహించబోతున్నాం. వాళ్లతో వెంటనే మాట్లాడి సమస్య పరిష్కరించండి. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పండి. వాళ్లకేమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలే తప్ప.. ఇలాంటి వైఖరిని సహించం. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నానికల్లా వారంతా మళ్లీ అధికారిక వాట్సప్‌ గ్రూపుల్లో చేరడంతో పాటు, తక్షణం విధులకు హాజరవ్వాలి...’’ అని ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలకు, అక్కడి నుంచి క్షేత్రస్థాయి అధికారులకు క్షణాల్లో ఈ ఆదేశాలు వెళ్లాయి. కొందరు అధికారులైతే సస్పెన్షన్‌ తప్పదని, క్రిమినల్‌ కేసులూ పెడతామని హెచ్చరించారు. అధికారులు నచ్చచెప్పడంతో... అక్కడక్కడా కొందరు మళ్లీ గ్రూపుల్లో చేరినప్పటికీ, మెజార్టీ ఉద్యోగులంతా ఇప్పటికీ నిరసన ధోరణిలోనే ఉన్నారు.

క్రిమినల్‌ కేసులు పెట్టమన్నారు

సచివాలయ ఉద్యోగులు అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం, విధులు బహిష్కరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. విశాఖ జిల్లా భీమిలి తహసీల్దారు కరణం వెంకటేశ్వరరావు వీఆర్‌ఓలకు ఫోన్‌లో జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్‌ సామాజిక మాధ్యమల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ‘‘కొంత మంది సచివాలయ ఉద్యోగులు పేస్కేల్స్‌ సరిగ్గా లేవని సమ్మెలోకి వెళతామని చెప్పినట్టు తెలిసింది. వారు విధులకు ఆటంకం కలిగిస్తే సస్పెండ్‌ చేసి, క్రిమినల్‌ కేసు పెట్టమని, అరెస్ట్‌ చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారు. మేం 30-35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి కూడా... ప్రభుత్వాన్ని ఏదైనా గట్టిగా అడగడానికి భయపడే పరిస్థితి. చెప్పిన పని చేయడానికే అలవాటయ్యాం. వాళ్లు నిన్న మొన్న వచ్చి... స్ట్రైక్‌ అదీ చేసి, విధులు బహిష్కరించి, అసంతృప్తి వ్యక్తం చేస్తే అక్కడితో పోదు. క్రిమినల్‌ కేసు బుక్కయితే ఇక ఏ ఉద్యోగమూ రాదు. సోమవారం మెగా ఓటీఎస్‌ నిర్వహిస్తున్నాం. గవర్నమెంట్‌ టార్గెట్‌ ఇచ్చిందంటే శని, ఆదివారాలు ఉండవు. వెంటనే హాజరవమనండి.. ఎల్లుండి మేళాకి అంతా రెడీ చేయాలి. మనం చాలా స్లోగా ఉన్నాం. భీమిలి మండలంలో నాలుగే జరిగాయని నేను గోలపడుతుంటే, రిజిస్ట్రేషన్లు చేయడానికి వీళ్లు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఆనందపురం, పద్మనాభం వంటి మండలాల్లో ఇప్పటికే 400-500 ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేసేశారు...’’ అని ఆయన హెచ్చరించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నిరసనలు

ప్రొబేషన్‌ వాయిదా వేయడంపై ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనూ సచివాలయ ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలియజేశారు. చాలా మంది అధికారిక వాట్సప్‌ గ్రూపులలో నిరసన తెలియజేసి నిష్క్రమించడంతో పాటు, వెంటనే ప్రొబేషన్‌ డిక్లర్‌ చేయాలని సీఎంని డిమాండ్‌ చేస్తున్న నినాదాన్ని హ్యాష్‌టాగ్‌తో ట్విటర్‌లో వైరల్‌ చేశారు. పలువురు సచివాలయ ఉద్యోగులు శనివారం జడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించి పథకాల్ని మాత్రం తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.15 వేలు వేతనం తప్ప, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, హెల్త్‌ బెనిఫిట్స్‌ అమలవడం లేదని వివరించారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులుగాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. అనంతరం వారు కమిషనర్‌ పీవీ రమణయ్యను, డిప్యూటీ ఛైర్మన్‌ బంగారురెడ్డిని కలసి వినతిపత్రాలు అందజేశారు. పులివెందుల మండలం పరిధిలో ఓటీఎస్‌ అమలుకి సంబంధించిన ఒక అధికారిక గ్రూపు నుంచి సచివాలయ ఉద్యోగుల్లో చాలా మంది వైదొలిగారు. ఈ నేపథ్యంలో వారందరి నెంబర్లు నోట్‌ చేసుకుని, తక్షణం చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణశాఖ పీడీకి అదే గ్రూపులో జేసీ (హౌసింగ్‌) ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ వైరల్‌ అయింది.

రెండేళ్లుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నా

‘‘నేను బీటెక్‌ (ఎలక్ట్రికల్‌) చదువుకున్నాను. ఏటా జాబ్‌ కాలెండర్‌ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో... సచివాలయ ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమవుదామనుకున్నాను. ఇస్తామన్న ప్రొబేషన్‌ ఇవ్వలేదు. జాబ్‌ క్యాలెండరూ లేదు. రెండేళ్లుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నా. శనివారం... ఆదివారం అని లేకుండా మాతో పనిచేయించారు. కరోనా తర్వాత అన్ని ఖర్చులూ పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే జీతం పెట్రోలు ఖర్చులకే చాలడం లేదు. ఇప్పుడు వేరే ప్రైవేటు ఉద్యోగం ఏదైనా చూసుకుందామనుకున్నా... సచివాలయ ఉద్యోగులుగా రెండేళ్ల మా అనుభవం దేనికీ పనికిరాదు. అదే ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలోనైనా చేరితే ఇప్పటికే జీతం రెట్టింపయ్యేది....’’ అని ఆ గ్రూపు నుంచి నిష్క్రమించిన ఒక సచివాలయ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో వాట్సప్‌ డిస్‌ప్లే పిక్చర్‌ (డీపీ)గా నల్లరంగు పెట్టి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని ఆరోగ్య కార్యకర్తలు విధులను బహిష్కరించారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రేపు సమావేశం

సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సోమవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు ఒక్కో ఉద్యోగ సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేలా చూస్తామని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఏపీవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో..!

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సోమవారం విధులు బహిష్కరించి, జిల్లా కలెక్టర్‌ని కలసి వినతిపత్రం ఇస్తామని ప్రకటించారు. తిరుపతిలోని ప్రకాశం పార్కులో పలువురు ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఓటీఎస్‌ వసూళ్లు చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో పాటు, పరుష పదజాలంతో దూషిస్తున్నారని, దీనిపైనా భవిష్యత్తులో ఆందోళన చేపడతామని ప్రకటించారు.

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో కొందరు వాట్సప్‌ డిస్‌ప్లే పిక్చర్‌ (డీపీ)గా నల్లరంగు పెట్టి నిరసన తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు సుమారు వంద మంది ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణలో సమావేశమయ్యారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ భుజాన వేసుకుంటే ఇదేనా మాకు దక్కిన గౌరవమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ గ్రూపుల్లో పోస్టులు పెట్టవద్దని సమావేశంలో కొందరు సూచించినట్టు సమాచారం. తమ డిమాండ్‌పై సోమవారానికి కూడా స్పష్టత రాకపోతే, అందరూ కలసి కలెక్టరేట్‌కి వెళ్లి వినతిపత్రం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు వాట్సప్‌ గ్రూపుల నుంచి వైదొలిగిన వారంతా తిరిగి చేరేలా... ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

  • విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో కొందరు సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. నెల్లిమర్ల ఎండీపీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గరివిడిలో జేసీకి, గజపతినగరంలో ఎమ్మెల్యే అప్పలనరసయ్యకు వినతిపత్రాలు అందజేశారు. బొబ్బిలిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉద్యోగులు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.
  • నెల్లూరు జిల్లాలోని గూడూరు, పొదలకూరు మండలాల్లో ఎంపీడీఓలకు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాలు అందజేశారు.
  • కర్నూలు జిల్లాలో జెడ్పీ సీఈఓకి వినపత్రం అందజేశారు. ఆదోనిలో మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

సచివాలయ ఏఎన్‌ఎంల నిరసన..

రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయ సిబ్బందిని వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని ఆరోగ్య కార్యకర్తలు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల ఆరోగ్య కార్యకర్తలు శనివారం విధులు బహిష్కరించి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమను రెగ్యులరైజ్‌ చేసి, పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వైద్యాధికారి అనూషకి వినతి పత్రం అందజేశారు.

సీఎం ప్రకటనతో తీవ్ర నిరాశ..!

ఏపీ వ్యాప్తంగా ఉన్న సుమారు 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకు 2021 అక్టోబరుకి రెండేళ్ల సర్వీసు పూర్తయింది. వారికి ప్రొబేషన్‌ ఇచ్చి, సర్వీసుని క్రమబద్ధీకరించి, పేస్కేల్‌ ఇవ్వాల్సి ఉంది. ప్రొబేషన్‌ ఇచ్చేందుకు వారికి ప్రభుత్వం అర్హత పరీక్షలు నిర్వహించింది. 2021 సంవత్సరాంతానికే సుమారు లక్ష మంది ప్రొబేషన్‌కి అర్హత సాధించారు. కొత్త పీఆర్‌సీని అమలు చేసినప్పుడైనా తమకు ప్రొబేషన్‌ ఖరారు చేస్తారని వారు ఆశించారు. వారికి ఈ ఏడాది జూన్‌ నెలాఖరులోగా ప్రొబేషన్‌ ఖరారు చేసి, కన్ఫర్మేషన్‌ ఇస్తామని, పెంచిన జీతాలు కూడా అప్పటి నుంచే అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం వారిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

ABOUT THE AUTHOR

...view details