Regularization of occupied government lands: ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూశాఖ ముందే సమాచారం సేకరించి పెట్టుకుంది. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల వారీగా కబ్జా ప్రాంతాలు ఎక్కడున్నాయనే దానిపై క్షేత్రస్థాయిలో వివరాలను సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి 125 చ.గజాలలోపు అయితే ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు జీవో ఎంఎస్.నం.58, ఆ పైన కబ్జాప్రాంతం ఉంటే మార్కెట్ ధర ప్రకారం చేసేందుకు జీవో ఎంఎస్.నం.59లను ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఇచ్చిన గడువులో 1.68 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 96 వేల మంది ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు.
కాలనీలు.. కొత్త ఇళ్లపై ముందే ఆరా:రాష్ట్రంలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టడం ఇది రెండోసారి. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు ఎక్కడున్నాయి? ఎవరి అధీనంలో ఉన్నాయి? నిబంధనల ప్రకారం 2014 జూన్, 2వ తేదీకి ముందు కబ్జాలో ఉండి, నిర్మాణాలు చేసుకున్నవారు ఎంత మంది ఉన్నారని మండల రెవెన్యూ అధికారులు ముందుగానే సమాచారం సేకరించారు. కొత్తగా ఏర్పడిన కాలనీలు, కొత్త ఇళ్లు ఎన్ని ఉన్నాయన్న వివరాలు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాథమికంగా నమోదు చేసుకున్నారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్లు గూగుల్ చిత్రాలను కూడా ఈ సమాచారంతో జతచేసి జిల్లా కలెక్టర్లకు పంపారు.