Andhra pradesh revenue 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడి కంటే... రెవెన్యూ ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో రెవెన్యూ లోటు కొండలా పేరుకుపోతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాలకు సంబంధించిన ఆ రాష్ట్ర లెక్కలు ఖరారయ్యాయి. చట్టసభలకు బడ్జెట్ సమర్పించిననాడు రెవెన్యూ లోటు రూ.5వేల కోట్ల 6 లక్షలు మాత్రమే. ఆ మేరకు రెవెన్యూ ఉంటుందని లెక్కించారు. ఆమేరకు రెవెన్యూ రాబడిని, ఖర్చులను సమన్వయం చేసుకునేలా బడ్జెట్ ప్రతిపాదించారు. డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన 9నెలల కాలంలో రెవెన్యూ లోటు రూ.45వేల 907.65 కోట్లుగా లెక్క తేలింది.
revenue : అంచనాలకన్నా అది 918.14శాతం మేర పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రెవెన్యూ లోటు... నాటి అంచనాలతో పోలిస్తే 270శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్రమేణా రెవెన్యూ రాబడులు మెరుగుపడుతున్నాయి. ఆ రాష్ట్ర సొంత ఆదాయాలకు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడిగా లెక్కిస్తుంటారు. రెవెన్యూ రాబడి దాదాపు లక్ష కోట్లకు చేరింది. ఈ 9నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటుగా వచ్చిన రూ.25వేల 246.19 కోట్లతో కలిపి మొత్తం రెవెన్యూ రాబడి రూ.97వేల 887.21 కోట్లకు చేరింది.