గ్రేటర్ పోరు: సర్కిళ్ల వారీగా నోటీసు విడుదల చేసిన ఆర్వోలు - గ్రేటర్ హైదరాబాద్ తాజా వార్తలు
11:02 November 18
గ్రేటర్ పోరు: సర్కిళ్ల వారీగా నోటీసు విడుదల చేసిన ఆర్వోలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా రిటర్నింగ్ అధికారులు నోటీసు విడుదల చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన బల్దియా అధికారులు.. సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన పత్రాలు ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.
గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద అవసరమైన బందోబస్తు సమకూర్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లోకి అనుమతిస్తారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. అందుకోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నిన్న ఒక్క రోజే దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలిగించారు.
ఇవీ చూడండి:మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ