కరోనా చికిత్సలో మరో ముందడుగు.. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్! కరోనా చికిత్సలో మరో ముందడుగు వేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ద్రవరూపంలో ఉన్న ప్లాస్మాను పొడిగా మార్చే విధానాన్ని ఆవిష్కరించారు. నిమ్స్ వైద్యనిపుణులు మధుమోహన్‌రావు నేతృత్వంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవి, రాజీవ్ బృందం ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు.
కరోనా బారిన పడి కోలుకున్న దాతల నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారానే ఈ పౌడర్‌ను తయారు చేస్తున్నారు. లియోఫిలైజ్డ్ యంత్రంతో ప్లాస్మాలోని నీటి శాతాన్ని తొలగించి... చివరగా మిగిలిన పదార్థాన్ని పొడిలాగా మార్చుతారు. గ్లూకోజ్ మాదిరిగా మారే ఈ పొడిలో కరోనాను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు, ప్రొటీన్లు మాత్రమే మిగులుతాయి.
అత్యవసర సమయాల్లో..
సాధారణ ప్లాస్మా నిల్వ, తరలింపునకు మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతోంది. కానీ, ఈ పొడికి మాత్రం అలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేకుండానే సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేసే వీలుంటుంది. మారుమూల ప్రాంతాలకూ దీనిని తీసుకువెళ్లి.. బాధితులకే అక్కడే చికిత్స అందించవచ్చు. వయసు, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ ఈ పొడిని ఉపయోగించే వీలుంటుంది. అత్యవసర సమయాల్లో దాతలు అందుబాటులో లేకపోయినా... నిల్వ చేసుకున్న ఈ పౌడర్ ప్లాస్మాను ఉపయోగించుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. పౌడర్‌ని ఐదేళ్లపాటు వినియోగించుకునే వీలుంటుందంటున్నారు. ప్లాస్మా చికిత్సలో భాగంగా ఈ పౌడర్‌ను సెలైన్‌లో కలిపి శరీరంలోకి ఎక్కించవచ్చునని చెబుతున్నారు.
పొడి రూపంలో తయారుచేసిన ప్లాస్మాను త్వరలోనే ఐసీఎంఆర్‌కు అందజేయనున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. అనుమతుల అనంతరం దీనిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడిస్తున్నారు.
ఇవీచూడండి:క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా