తెలంగాణ

telangana

ETV Bharat / city

సిఫార్సు లేక.. పరీక్ష జరగక.. అనుమానితుల అష్టకష్టాలు

రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా నిర్ధారణ కేంద్రాలు ఎన్ని ఉన్నా పరీక్షల కోసం అగచాట్లు తప్పడంలేదు. తమకు వైరస్‌ ఉందో లేదో పరీక్షలు చేయించేందుకు అనుమానితులు పైరవీలు చేయాల్సి వస్తోంది. లేనిపక్షంలో ఆ రోజున సమయం దొరకడం లేదు. ఒకటి రెండు రోజులు ఆగి తెల్లవారుజామునే క్యూలో నిలబడితే ఆ రోజు అవకాశముంటే జరుగుతోంది. లేని పక్షంలో మరునాడు వెళ్లి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలకొంది.

CORONAVIRUS
CORONAVIRUS

By

Published : Aug 4, 2020, 6:52 AM IST

హైదరాబాద్‌ నగరంలో గత నెల రోజుల కంటే రెట్టింపు పరీక్షలు జరుగుతున్నా ఇంకా కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. వేలాదిమందికి ఏదో ఒకరకమైన లక్షణాలు ఉండటంతో అప్పటికప్పుడు పరుగులు తీసున్నారు. కొన్నిచోట్ల ఎడం కూడా పాటించడం లేదు. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, కూకట్‌పల్లి, ఎర్రగడ్డతోపాటు ఇంకా అనేక కేంద్రాల్లో 250కు మించి పరీక్షలు జరగడం లేదు. ఇంకొన్నిచోట్ల రోజుకు 25 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. గాంధీ, సీసీఎంబీ కేంద్రాలకు వెళ్లాలంటే వైద్యుల సిఫార్సు ఉండాల్సిందే. నిమ్స్‌లో కేవలం ఆ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకే చేస్తున్నారు.

పరీక్షల సంఖ్యను పెంచితేనే ఫలితం!

పరీక్షల సంఖ్య ఇప్పుడున్నదానికంటే మరో రెండు రెట్లు పెంచాల్సి ఉంది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, ఎర్రగడ్డ, సికింద్రాబాద్‌ వంటి కేంద్రాలలో ఒక్కోదానిలో రోజుకు 500 ఆపైన పరీక్షలు చేస్తే ఫలితం ఉంటుందన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.

కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు కలుపుకొన్నా 117 చోట్ల మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అనుమానితుల సంఖ్యకు తగ్గట్టుగా ఇవి లేవు. అదీ ఆదివారం వస్తుంటే చాలావరకు నిలిపివేస్తున్నారు. సాధారణ రోజుల్లో దాదాపు రాష్ట్ర మంతటా 20 వేల పరీక్షలు చేస్తే గత ఆదివారం కేవలం 9443 పరీక్షలు మాత్రమే చేశారు. ఇందులోగ్రేటర్‌లోని 3 జిల్లాల్లో చేసినవి 5వేలే

కూకట్‌పల్లిలో పరిశీలిస్తే..

సోమవారం కూకట్‌పల్లి అర్బన్‌ ఆరోగ్య కేంద్రానికి దాదాపు ఆరేడు వందల మంది వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 200 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొంతమందికి తీవ్రమైన వైరస్‌ లక్షణాలు ఉన్నా ఆరోజు పరీక్ష చేయకపోవడంతో ఇతర అనుమానితులతో కలిసి తిరిగి ఇంటిముఖం పట్టారు. అనేక కేంద్రాల దగ్గర ఇదే పరిస్థితి. చాలామంది తమ ప్రాంత శాసనసభ్యుడినో, స్థానికంగా పట్టు ఉన్న నాయకులతో ముందురోజు చెప్పి సమయం తీసుకుని పరీక్షకు వెళ్తున్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉన్న కేంద్రంలో ఇటీవలవరకు పోలీసులు, ఇతర ఉద్యోగులు అప్పటికప్పుడు పరీక్షలు చేయించుకునేవారు. దీంతో తెల్లవారుజాము నుంచి అక్కడ ఉన్నవారు నిరసన వ్యక్తం చేయడంతో అందరికీ కలిపే పరీక్షించే ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details