రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2015 డిసెంబరు ఆరో తేదీన తొలిసారి ఈ పదవిలో నియమితులైన ఆయన మూడేళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత హైకోర్టులో కేసు కారణంగా సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అవి పరిష్కారం కావడంతో తాజాగా సీఎం కేసీఆర్ ఆయనను మరోసారి నియమించాలని నిర్ణయించారు.
ఉత్తర్వులు వెలువడిన వెంటనే రసమయి మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు. కేసీఆర్ ఆయనను అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరేలా సాంస్కృతిక సారథి కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ, స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కళాకారుల పాత్ర గొప్పదన్నారు. దేశానికే ఆదర్శంగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు మరింతగా చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్గా రెండోసారి నియామకమైన రసమయి కృషి చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.