ఏపీ ముఖ్యమంత్రి జగన్కు కలలో ఎవరు కనపడి రాజధాని మార్చమన్నారో తెలియదని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎంతోమంది రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు.
"గతంలో అమరావతి రాజధానికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదు. ఇప్పుడెందుకు నిర్ణయం మార్చుకున్నారో అర్థం కావట్లేదు. రాజధాని శంకుస్థాపనకు వెళ్లకపోతే వ్యతిరేకమని అనుకున్నాం. వ్యతిరేకంగా మాట్లాడకపోయేసరికి ప్రజలంతా జగన్‌ను నమ్మారు. రెఫరెండం ద్వారా ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేదు. రహస్యంగా రెఫరెండం పెట్టినా సరిపోతుంది. మూడు రాజధానులు కావాలా, వద్దా అనే అంశంపై రెఫరెండం తీసుకోండి. భూములిచ్చిన రైతుల్లో బీసీలు, ఎస్సీలే ఎక్కువమంది ఉన్నారు. వైకాపాలో బట్రాజు, సేనాని, మంత్రిగా ఒక్కరే వ్యవహరిస్తున్నారు. ఒక బట్రాజును పక్కనపెట్టుకుని ఇతరులను అవమానించడం తగదు."