ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం రాచకొండ పోలీసులు కొత్తకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ దుశ్చర్యను నిరోధించడమే లక్ష్యంగా పనిచేసేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళలను వ్యభిచార కూపంలోకి లాగేందుకు.. ఇంటి పనులు, యాచన, బలవంతపు పెళ్లిళ్లు చేసేందుకు చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారు. మానవ అవయవాల కోసం అక్రమ రవాణా చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ అక్రమాలను నిరోధానికి రాచకొండ పోలీసులు కృషి చేస్తున్నారు. రాచకొండ కమిషనర్ క్యాంప్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సీఐ నేతృత్వంలో మహిళా కానిస్టేబుళ్లు ఉంటారు..
150 బిలియన్ డాలర్ల చీకటి వ్యాపారం..
మానవ అక్రమ రవాణా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. అంతర్జాతీయంగా 150 బిలియన్ డాలర్ల చీకటి వ్యాపారం జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపి చేసే వ్యాపారమే 99 బిలియన్ డాలర్ల వరకు ఉంది. మానవ అక్రమ రవాణా కేసులను మానవీయ కోణంలో చూడాలని పోలీస్‌శాఖ భావిస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళల పునరావాసానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు.