YS Viveka murder case update: వివేకా హత్య కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయాలన్న పిటిషన్‌ను ఏపీలోని పులివెందుల కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ హత్య కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్‌ను మరోసారి కోర్టు పొడిగించింది. ఇందులో శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఉన్నారు. జనవరి 11 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. కడప జైలు నుంచే ఆన్‌లైన్ ద్వారా నిందితులు జడ్జి ముందు హాజరయ్యారు.
శివశంకర్‌రెడ్డిపై సీబీఐ అభియోగాలు..
CBI On YS Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని సీబీఐ తేల్చింది. వివేకా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నప్పటికీ ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టింది శివశంకర్‌రెడ్డేనని స్పష్టం చేసింది. అదే విషయాన్ని ఆయనే ‘సాక్షి’ టీవీకి కూడా చెప్పారని వెల్లడించింది. వివేకా గుండెపోటుతోనే మరణించినట్లు నమ్మించేందుకు వీలుగా పడక గది, స్నానపు గదిలోని రక్తపు మరకలన్నింటినీ తుడిపించేశారని, ఘటనా స్థలంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని వివరించింది.
YS Viveka Murder Case news: ఆ క్రమంలోనే వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్లు కట్టించారని తెలిపింది. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ గత నెల 17న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన బెయిలు మంజూరు కోసం కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. అంతకు ముందు దీనిపై వాదనల సందర్భంగా వివేకా హత్యలో శివశంకర్‌రెడ్డి పాత్రపై తమ దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల్ని న్యాయస్థానం ఎదుట సీబీఐ ఉంచింది. అందులోని ప్రధానాంశాలు..
- కొందరు సాక్షులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు.
- కుట్రకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం చాలా కీలక దశలో ఉంది. ఇలాంటి దశలో శివశంకర్‌రెడ్డికి బెయిలిస్తే ఆయన ఆధారాలు తారుమారు చేసే, పరారయ్యే అవకాశం ఉంది.
- వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కుట్ర చేశారు. హత్యకు నెల రోజుల ముందే దీనికి రూపకల్పన జరిగింది. వివేకాను చంపితే భారీ మొత్తంలో డబ్బులిస్తానని యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి ఆఫర్ చేశారు.‘
- వివేకా గుండెపోటుతో చనిపోయారు. ఆయన ఇంటి వద్ద భారీగా జనం గుమికూడుతున్నారు. వెంటనే అక్కడికి వచ్చి జనసందోహాన్ని నియంత్రించాలి’ అంటూ పులివెందుల సీఐను శివశంకర్‌రెడ్డి సంప్రదించారు.
- ‘వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారంటూ మేము చెబుతాం. ఈ వ్యవహారంలో నోరుమూసుకుని ఉండాలి’ అంటూ సీఐ శంకరయ్యను, ఘటనా స్థలంలోని సాక్షుల్ని శివశంకర్‌రెడ్డి దుర్భాషలాడారు.
- రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న సందర్భంలోనూ, గాయాలకు బ్యాండేజీ వేసి కట్లు కడుతున్న సమయంలోనూ లోపలి నుంచి తలుపులేసేశారు. శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితుల ఆదేశాల మేరకే అలా చేశారు.
- వివేకా మృతి వార్త తెలిసి అక్కడికి వచ్చిన వారందర్నీ... ఆయన రక్తపు వాంతులు, గుండెపోటుతో చనిపోయారంటూ పేర్కొంటూ శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు నమ్మించారు.
ఇదీ చదవండి:రెండు నెలల చిన్నారి గుండెకు అరుదైన ఆపరేషన్- దేశంలోనే ఫస్ట్!